Bapatla city News :బాపట్లలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

Sharat
1 View

బాపట్ల:-తెలుగు సినీ రంగానికి మహోన్నత సేవలు అందించి, కోట్లాది మంది అభిమానులకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రజలందరికీ నిజమైన అన్నయ్య అని, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవుడని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామాన వెంకట శివన్నారాయణ కొనియాడారు. మెగాస్టార్ జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం బాపట్ల పట్టణంలో జనసేన పార్టీ, మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రముఖ దేవాలయాల్లో అభిమానులు, పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్‌లో కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చుతూ స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నామాన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ… ఎలాంటి సినీ నేపథ్యం లేని సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి, తన స్వయంకృషితో అగ్రకథానాయకుడిగా ఎదిగి తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేశారని గుర్తుచేశారు. కెరీర్ ప్రారంభంలో అనేక అవమానాలు, విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, పట్టుదలతో శ్రమించి సినీ పరిశ్రమను ఏలిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు వంటి దిగ్గజాల కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని తెలిపారు. టాలీవుడ్‌కు బ్రేక్‌డ్యాన్స్‌ను పరిచయం చేయడమే కాకుండా, ఆయన వైవిధ్యమైన డ్యాన్సులు, మ్యానరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షక లోకాన్ని మైమరిపించారని అన్నారు.

దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా అలరిస్తున్న చిరంజీవి, ఇప్పటికీ నిత్య విద్యార్థిగా, నిత్య శ్రామికుడిగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుండడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ తేజా, నాయకులు మనాలి చైతన్య, పిట్టలవానిపాలెం మండల అధ్యక్షుడు దాదా, జిడుగు మాధురి, జ్యూస్ శ్రీను, శివయ్య, సత్యనారాయణ, వెంకటరావు, సాయిబాబు, సాయిరాం ప్రసాద్‌తో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review