ఏలూరు (సెప్టెంబర్ 10):– తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు తన సతీమణి రెడ్డి అనురాధతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం, వాడపల్లిలో వేంచేసియున్న ‘కోనసీమ తిరుపతి’ శ్రీ వేంకటేశ్వర స్వామివారిని గురువారం ఆయన దంపతి సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తొలుత ఆలయానికి చేరుకున్న అప్పలనాయుడు దంపతులకు ఆలయ మర్యాదలతో వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందజేసి, తీర్థప్రసాదాలను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ… “తన పుట్టినరోజున కలియుగ దైవమైన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తోంది. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించాను. ఆ శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులు రాష్ట్రంపై ఎల్లవేళలా ఉండి, ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు



