Amaravathi city News :శతాబ్దం కాలం నాటి భూ సమస్యలూ పరిష్కరిస్తున్నాం-8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు

Sharat
3 Views

అమరావతి:-11-9-26:-రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున రెవెన్యూ, విద్య, నైపుణ్యాభివృద్ధి, పురపాలక, విద్యుత్ శాఖలపై ఆయన సుదీర్ఘ సమీక్ష జరిపారు.Amaravathi News

ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • రూ. 5 వేల కోట్ల విలువైన భూములకు విముక్తి: గత ప్రభుత్వ హయాంలో వివాదాల్లో చిక్కుకున్న భూములతో పాటు, శతాబ్దాల నాటి భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు సీఎం తెలిపారు. 120 ఏళ్ల నాటి అంబాజీపేట గ్రౌండ్ రెంట్ భూముల సమస్య సహా ఇప్పటివరకు 232 సుదీర్ఘ పెండింగ్ వివాదాలను క్లియర్ చేశామని వెల్లడించారు. దీనిద్వారా సుమారు రూ. 5,000 కోట్ల విలువైన 31 వేల ఎకరాలకు విముక్తి లభించిందన్నారు. రీసర్వే పూర్తయిన భూములకు నవంబరు 1 నుంచి బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.
  • స్థానిక యువతకే నైపుణ్య శిక్షణ – ఉద్యోగాలు: రాష్ట్రానికి వచ్చే పరిశ్రమల్లో స్థానిక యువతకే ప్రాధాన్యం దక్కేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం నిర్వహించాలని సీఎం ఆదేశించారు. విశాఖతో పాటు ఇతర ప్రాంతాలకూ ‘పీఎం సేతు’ను విస్తరిస్తామన్నారు. ఇప్పటికే 4.98 లక్షల మంది యువత నైపుణ్య పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని, నియోజకవర్గాల వారీగా జాబ్ ఫెయిర్లు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
  • 2027 నాటికి 100% అక్షరాస్యత: ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా 2027 నాటికి రాష్ట్రంలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలని, ఏపీని ‘లిటరేట్ లెర్న్డ్ స్టేట్’గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. పాఠశాల భవనాల భద్రతపై తక్షణమే ఆడిటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులిచ్చారు.
  • పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేయాలి: విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సోలార్ రూఫ్‌టాప్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ద్వారా అందించే కేంద్ర సబ్సిడీలను ప్రజలకు చేరవేయాలన్నారు. 28 జిల్లాల్లోని 2,932 పాఠశాల భవనాలపై 47 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్యానెళ్లను త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. 2025-26 ఏడాదికి సగటు విద్యుత్ కొనుగోలు ధర యూనిట్‌కు రూ. 4.97కి తగ్గించామని, గత రెండేళ్లుగా టారిఫ్ పెంచలేదని సీఎం గుర్తుచేశారు.
  • స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో పురస్కారాలు: నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీస్‌గా గుంటూరు (జాతీయంగా 2వ స్థానం), విజయవాడ వార్డులు ఎంపికవడంపై సీఎం ప్రశంసించారు. ఈ ఏడాది ఏపీ నగరాలు రూ. 1.05 కోట్ల నగదు ప్రోత్సాహకంతో పాటు 5 జాతీయ అవార్డులను దక్కించుకున్నాయని కొనియాడారు.
Author
Share This Article
Leave a review