విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టి లాభసాటి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని సూచించారు. విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్పో-2026ను మంత్రి కందుల దుర్గేష్, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. భారతదేశంలో ఉన్న అనేక అద్భుతాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కొలువుదీరి ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఏపీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ కూడా భాగస్వామి కావాలని కోరారు.
ఎంఎస్ఎంఈ ఎక్స్పో యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ నూతన ఆలోచనలు, ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు మంచి వేదికగా నిలుస్తుందని చెప్పారు. అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సరఫరాదారులతో నేరుగా అనుసంధానం కావడంతో పాటు పరిశ్రమలలో వస్తున్న మార్పులు, వినియోగదారుల అవసరాలు, ఆధునిక సాంకేతికతపై అవగాహన పొందేందుకు ఎక్స్పో ఉపయోగపడుతుందన్నారు.vishaka city News
స్టార్టప్‌లు, వ్యాపార ఆలోచనలకు అవసరమైన ఆర్థిక సహకారం, క్రెడిట్ సపోర్ట్, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఎక్స్పో మంచి అవకాశాన్ని కల్పిస్తోందన్నారు. సీనియర్ పారిశ్రామికవేత్తల అనుభవాలను తెలుసుకోవడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు దిశానిర్దేశం లభిస్తుందని తెలిపారు.
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా
ప్రస్తుతం పర్యాటక రంగం అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగంగా, లాభసాటి వ్యాపార రంగంగా ఎదుగుతోందని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం 2024-29తో రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపిరి వచ్చిందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
కనెక్టివిటీ, టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు, కెపాసిటీ బిల్డింగ్, మౌలిక సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇన్‌బౌండ్ టూరిజాన్ని పెంచే లక్ష్యంతో అడ్వెంచర్, ఎకో, వెల్నెస్, క్రూయిజ్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
2019-24 మధ్య పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం కొత్త పాలసీ ద్వారా థీమ్ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు, ఎకో పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని మంత్రి వివరించారు.
గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
రాబోయే గోదావరి పుష్కరాలకు 10 నుంచి 15 కోట్ల మంది భక్తులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. భక్తుల వసతి కోసం నదీ తీర ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో టెంట్ సిటీలు, హోమ్‌స్టేలు, హోటల్ రూమ్‌లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
పుష్కరాలు జరిగే ఆరు జిల్లాల్లో అప్రోచ్ రోడ్లు, ఏటిగట్ల పటిష్టత, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక అనుభూతిని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను రూపొందిస్తున్నామని చెప్పారు.
తిరుమల, అన్నవరం, శ్రీశైలం, అహోబిలం, గండికోట, సూర్యలంక, విశాఖ బీచ్‌లు, మారేడుమిల్లి, అరకు, బొర్రా గుహలు తదితర ప్రాంతాలను అనుసంధానం చేసేలా టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
స్థానిక కళలు, వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు
కూచిపూడి నృత్యానికి విశ్వవ్యాప్త గుర్తింపు తీసుకురావడంతో పాటు ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, శ్రీకాళహస్తి కలంకారీ, ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి చేనేత వస్త్రాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వంటకాలను ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసేందుకు కలినరీ టూరిజానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు అనంతపురం, అరకు, గండికోట ప్రాంతాల్లో గ్లోబల్ గోల్ఫ్ కోర్సుల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
రూ.500 కోట్లతో తిరుపతి, విశాఖ అభివృద్ధి
దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయనున్న 50 ప్రధాన పర్యాటక గమ్యస్థానాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుపతి, విశాఖపట్నం ఎంపికయ్యాయని మంత్రి తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను రూ.500 కోట్ల వ్యయంతో ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు.
ప్రతి రాష్ట్రానికి సాధారణంగా ఒక పర్యాటక ప్రాంతానికి మాత్రమే అవకాశం లభించే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి రెండు ప్రాజెక్టులు దక్కాయని చెప్పారు. దేశీయ, విదేశీ పర్యాటకులకు మెరుగైన వసతులు, భద్రత, ఆహారం, డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ 2047’, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047’ విజన్‌కు అనుగుణంగా పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు.
పర్యాటక రంగం పరుగులు పెడుతోంది: ఎంపీ శ్రీభరత్
విశాఖ ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వ ఆలోచనలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం, పెట్టుబడులను గ్రౌండింగ్ చేయడంలో మంత్రి దుర్గేష్ సమర్థంగా పనిచేస్తున్నారని అన్నారు.
ఎంఎస్ఎంఈ ఎక్స్పో యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నూతన ఆలోచనలకు మంచి వేదికగా నిలుస్తుందని చెప్పారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, ఏపీ ఛాంబర్స్ విశాఖ ప్రతినిధి శోభన్ ప్రకాష్, ప్రతినిధులు త్రినాథ్, రామకృష్ణ, మల్లిఖార్జునరావు, లక్ష్మీనారాయణ, భాస్కర్, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్. స్వామి, వివిధ రంగాల ప్రతినిధులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.



