GUNTUR DISTRICT NEWS: గుంటూరు రూపురేఖలు మారాలి – సుందరమైన, ఆకర్షణీయమైన పట్టణంగా మారాలి

Karthik

గుంటూరు పట్టణ రూపురేఖలు మారాలని, సుందరమైన, ఆకర్షణీయమైన పట్టణంగా మారాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ ప్రగతిపై కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పెమ్మసాని చంద్ర శేఖర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గుంటూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడాలని అన్నారు. సురక్షిత తాగునీరు, చక్కని పారిశుధ్యం, ఆహ్లాదాన్ని ఇచ్చే పార్కులు, మంచి రహదారులు, కాలువలు వంటి సౌకర్యాలు సమకూర్చి సుందరమైన పట్టణంగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఆసక్తిగల పౌరులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా వాణిజ్య సంస్థల నుండి వచ్చే చెత్త నిర్మాణ పట్ల దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుధ్యం నిర్వహణను ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు. ప్రజా వినియోగం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు. బొంగరాలబీడు వద్ద మంచి పార్కు అభివృద్ధి చేయాలని ఆదేశించారు. శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ పనులు త్వరగా పూర్తి చేయుటకు అవసరం మేరకు కార్మికులను పెంచాలని, 2027 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేగవంతంగా పూర్తి చేయుటకు ఉన్న ఆటంకాలను పరిష్కరించాలని ఆదేశించారు. గోరంట్ల నీటి పథకం జూన్ మొదటి వారం నాటికి ప్రారంభం కావాలని ఆదేశించారు. పోస్టర్లు, ఫ్లెక్సీలు నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, రామాంజనేయులు, కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ, కమిషనర్  కె.మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review