హైదరాబాద్:11-09-26:- రాష్ట్రంలో కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM), తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ డిమాండ్ చేశాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే కౌలు రైతులకు సాగుదారు కార్డులు జారీ చేయడంతో పాటు, వారు పండించిన పంటలను కనీస మద్దతు ధర (MSP)కు విక్రయించుకునేలా చర్యలు చేపట్టాలని కోరాయి.
గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని అమలు చేస్తూ, ఈ ఖరీఫ్ నుంచే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గడిచిన కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ జాప్యం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.BreakingNewsHyderabad
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఈ ఏడాది తక్కువ వర్షపాతం, ఎల్ నినో ప్రభావం వల్ల పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కౌలు రైతులకు మద్దతు ధర దక్కకపోతే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వెంటనే స్పందించి సెప్టెంబర్ నెల నుంచే కౌలు సాగుదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమల్లో ఉన్నప్పటికీ, ప్రభుత్వం కౌలు రైతులకు సాగుదారు కార్డులు ఇవ్వకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఖరీఫ్ లో సకాలంలో వర్షాలు లేక, ఎల్ నినో ప్రభావంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో కౌలు రైతులకు మద్దతు ధర (MSP) దక్కకపోతే వారు కోలుకోలేని దెబ్బతింటారు. ప్రభుత్వం ఇప్పటికైనా కంటితుడుపు చర్యలు స్వస్తి చెప్పి, సెప్టెంబర్ నెల నుంచే కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి సాగుదారు కార్డులు అందజేయాలి.”



