నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామంలో శ్రీకృష్ణాష్టమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11వ రోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేత కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, ఉట్టి ఉత్సవం, గ్రామోత్సవ ఊరేగింపు నిర్వహించారు.

రావిచెర్లలోని శ్రీకృష్ణ మందిరంలో ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, తులసి అర్చన, గోపూజ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. మహిళలు భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు.EluruReservoir
సాయంత్రం 6 గంటలకు ఉట్టి ఉత్సవం, గ్రామోత్సవ ఊరేగింపు వైభవంగా సాగింది. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ, జై శ్రీకృష్ణ నినాదాలతో స్వామివారిని చిన్న రథంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగించారు. భక్తులు పూలతో స్వాగతం పలుకుతూ, కర్పూర హారతులు సమర్పించారు.
అనంతరం కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



