అమరావతి (సెప్టెంబర్ 21):– రేయింబవళ్లు కష్టపడి చదివి, క్రీడల్లో ప్రతిభ చాటి మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులను ‘ఫేక్’ అని సంబోధిస్తూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం సరికాదని రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వేలాది మంది ఉపాధ్యాయుల కష్టాన్ని వివాదాస్పదం చేయడం తగదని వ్యాఖ్యానించారు.
విజయవాడలోని శాప్ (SAP) కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై సోమవారం అమరావతిలో ఆయన స్పందించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే అవి భౌతిక ఘర్షణలకు దారితీయకూడదని స్పష్టం చేశారు. ఘటనలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
148 రోజుల్లో 16,347 పోస్టుల భర్తీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి తెలిపారు. రికార్డు స్థాయిలో 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని చెప్పారు. నోటిఫికేషన్ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన వరకు ప్రతి దశనూ పక్కాగా అమలు చేశామని, ఎవరికైనా ఆధారాలతో కూడిన అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.
స్పోర్ట్స్ కోటాపై అసంబద్ధ ఆరోపణలు వద్దు: స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. నిర్దిష్ట సర్టిఫికెట్లపై అనుమానాలు ఉంటే విచారణ జరిపించవచ్చని, కానీ మొత్తం క్రీడాకారులందరినీ ‘ఫేక్’గా చిత్రీకరించడం దారుణమన్నారు. ఉపాధ్యాయులు రాజకీయ ఘర్షణల్లో బాధితులుగా మారడం బాధాకరమని, వారి వాదనను కూడా సమాజం వినాల్సిన అవసరం ఉందన్నారు.
గ్రూప్-1 లీకేజీలపై కోర్టు పరిధిలోనే నిర్ణయం: గత ప్రభుత్వ హయాంలో జరిగిన APPSC గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో ఎస్ఐటీ (SIT) అనేక లోపాలను గుర్తించిందని మంత్రి ప్రస్తావించారు. 736 రికార్డుల్లో 718 చోట్ల ఓవర్రైటింగ్, మార్పులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని, అయితే జవాబు పత్రాల తారుమారుపై కోర్టు పరిధిలోనే వాస్తవాలు తేలాల్సి ఉందన్నారు.
“ఉపాధ్యాయుల కష్టాన్ని రాజకీయ వివాదంగా మార్చకండి. ఆరోపణలు ఉంటే ఆధారాలు చూపించి విచారణ కోరండి. అంతే తప్ప కష్టపడి ఉద్యోగాలు సాధించిన వారి గౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదు” అని మంత్రి సుభాష్ హెచ్చరించారు.



