గుంటూరు జిల్లాలోని నాలుగు పట్టణాల్లో మొత్తం రూ.527 కోట్లతో చేపట్టనున్న పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడం జిల్లాకు లభించిన అరుదైన అవకాశమని జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ అన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 123 మున్సిపాలిటీలలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు 11,360 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా బుధవారం శంకుస్థాపన జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి జిల్లా కలెక్టర్ సి. యం. సాయికాంత్ వర్మ, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ శాసన సభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, గళ్ళా మాధవి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, హాజ్ కమిటీ చైర్మన్ షేక్ హాసల్ భాష, గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ మయూర్ అశోక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని గుంటూరు నగరపాలక సంస్థకు 205 కోట్లు, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.250 కోట్లు, తెనాలి మున్సిపాలిటీకి రూ.44 కోట్లు, పొన్నూరు మున్సిపాలిటీకి రూ.28 కోట్లతో మొత్తం 527 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకుని HAM మోడల్ ద్వారా ఇంత పెద్ద స్థాయిలో ప్రాజెక్టులను చేపట్టడం దేశంలోనే తొలిసారిగా జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతి రాజధాని నగరంతో పాటు గుంటూరు, మంగళగిరి-తాడేపల్లి, తెనాలి, పొన్నూరు పట్టణాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా భవిష్యత్‌లో మరింత వేగంగా అర్బన్ జిల్లాగా రూపుదిద్దుకోనుందని కలెక్టర్ తెలిపారు. ఈ అవకాశాన్ని అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రజలను అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలన్నారు. కేబుల్స్‌కు అండర్‌గ్రౌండ్ డక్ట్స్ ఏర్పాటు పైలట్ ప్రాజెక్ట్ గుంటూరు నగరంలో రహదారులపై అస్తవ్యస్తంగా ఉన్న ఓవర్‌హెడ్ కేబుల్స్‌కు పరిష్కారంగా అండర్‌గ్రౌండ్ డక్ట్స్ ఏర్పాటు చేసే విధానాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి చేసిన సూచన మేరకు, నగరంలో చేపట్టనున్న మోడల్ రోడ్లలో ఒక రోడ్డును ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా అండర్‌గ్రౌండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టోరేజ్ వ్యవస్థపై కూడా వివిధ నగరాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేసి, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఉత్తమ నమూనాను పరిశీలించిన అనంతరం గుంటూరు నగరంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. ప్రతి రూపాయితో ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పనులు ప్రస్తుతం లభిస్తున్న భారీ స్థాయి నిధులు తరచుగా లభించే అవకాశం కాదని, ఇది ఒక ప్రత్యేకమైన అవకాశమని కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. కేటాయించిన నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ, ఖర్చు చేసే ప్రతి రూపాయికి ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కనిపించేలా అధికారులు, ఇంజనీర్లు నాణ్యతతో పనులు చేపట్టాలని సూచించారు.గుంటూరు జిల్లాకు రూ.527 కోట్ల మేర నిధులు కేటాయించి పట్టణాభివృద్ధికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు పట్టణాల ప్రజలు అభివృద్ధి కార్యక్రమాల్లో సంపూర్ణంగా భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టణాలు, నగరాలు ఆయా రాష్ట్రాల ముఖచిత్రాలు…..ఎమ్మెల్యే గళ్లా మాధవిహైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) ద్వారా చేపట్టే అభివృద్ధి పనులతో గుంటూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. HAM మోడల్ ద్వారా రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, కేబుల్స్, పార్కులు, నీటి వసతులు తదితర మౌలిక వసతులను సమన్వయంతో ఒకే సమగ్ర ప్రాజెక్టులో అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు వివిధ శాఖలు వేర్వేరుగా పనులు చేపట్టడం వల్ల ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఈ సమగ్ర విధానం దోహదపడుతుందన్నారు. అలాగే గుంటూరు నగరంలో ఒక వార్డును ‘స్మార్ట్ వార్డ్’గా పైలట్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్ల సమస్యకు పరిష్కారంగా అండర్‌గ్రౌండ్ కేబులింగ్ విధానాన్ని పరిశీలించాలని, అలాగే అండర్‌గ్రౌండ్ గార్బేజ్ సిస్టమ్‌ను కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. అమరావతి రాజధాని నగరానికి సమీపంలో ఉన్న గుంటూరు నగరం అభివృద్ధిలో వెనుకబడకుండా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. HAM మోడల్‌తో గుంటూరు నగరం సమగ్ర అభివృద్ధి….ఎమ్మెల్యే నజీర్ అహ్మద్హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా గుంటూరు నగరంలో సమగ్రంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసే అవకాశం లభించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గతంలో పట్టణాల్లో ఇరుకైన రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కొరత వంటి సమస్యలు ఉండేవని, ప్రస్తుతం పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. HAM మోడల్ ద్వారా రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పార్కులు, లైటింగ్, బ్యూటిఫికేషన్ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు నగర పాలక సంస్థకు సుమారు రూ.205 కోట్ల నిధులు రావడం అభినందనీయమని, నగరంలోని మారుమూల ప్రాంతాలకు సైతం మౌలిక వసతులు అందేలా అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. ఇప్పటికే వివిధ పథకాల ద్వారా గుంటూరు నగరంలో సుమారు రూ.1,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. HAM ద్వారా లభించే నిధులను కూడా ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే విధంగా సద్వినియోగం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్ పర్సన్ వందన, పెద్ద ఎత్తున ప్రజలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



