Machillipatanam City News :మచిలీపట్నం అభివృద్ధికి రూ.51 కోట్ల నిధులు-అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన

Sharat
2 Views

మచిలీపట్నం, సెప్టెంబరు 22: మచిలీపట్నం పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.51 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కుప్పం నియోజకవర్గం కడపల్లెలో వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న రూ.51 కోట్ల అభివృద్ధి పనులకు మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రావెలర్స్ బంగ్లా వద్ద కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నం పట్టణంలో దీర్ఘకాలంగా ఉన్న తాగునీరు, డ్రైనేజీ, రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకుని పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

డ్రైనేజీ వ్యవస్థకు రూ.15 కోట్లు

పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు సుమారు 160 డ్రైనేజీ గ్యాప్‌లను పూడ్చేందుకు రూ.15 కోట్ల నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అవసరాన్ని బట్టి మరిన్ని డ్రైనేజీ అభివృద్ధి పనులకు అదనపు నిధులు సమకూర్చనున్నట్లు చెప్పారు.

మచిలీపట్నం మెడికల్ కాలేజీ సమీపంలో రెండు సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.53 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిందని తెలిపారు.Krishna disrtrict News :సేవే లక్ష్యంగా 2,600 వైద్య శిబిరాలు-తొలి శిబిరాన్ని గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభించిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

మున్సిపల్ కార్యాలయానికి రూ.7.50 కోట్లు

మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి రూ.7.50 కోట్ల నిధులు మంజూరైనట్లు కొల్లు రవీంద్ర తెలిపారు. ఆధునిక సదుపాయాలతో కార్యాలయాన్ని నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

పట్టణంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి, రోడ్ల వెడల్పు, మెడికల్ కాలేజీకి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు అనుసంధాన రహదారి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా మెడికల్ కాలేజీ వైపు రాకపోకలను సులభతరం చేయనున్నట్లు చెప్పారు.

పెండింగ్ రోడ్ల పనులకు రూ.27 కోట్లు

మచిలీపట్నం పట్టణంలో పెండింగ్‌లో ఉన్న రోడ్ల పనులను పూర్తి చేసేందుకు రూ.27 కోట్లతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు. పార్కులు, బరియల్ గ్రౌండ్లు, శ్మశాన వాటికలు వంటి ప్రజా మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

ప్రధాన శ్మశాన వాటిక అభివృద్ధికి ఓ ప్రైవేటు సంస్థ సుమారు రూ.2 కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు.

రవాణా, కనెక్టివిటీకి ప్రాధాన్యం

ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ మచిలీపట్నం మున్సిపల్ కార్యాలయ నిర్మాణానికి గతంలో శంకుస్థాపన జరిగినా వివిధ కారణాలతో పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రస్తుతం అవసరమైన నిధులు మంజూరు కావడంతో నిర్మాణ ప్రక్రియ వేగం పుంజుకుందని తెలిపారు.

మచిలీపట్నం–విజయవాడ రైల్వే మార్గం డబ్లింగ్, ఎలక్ట్రిఫికేషన్, రైల్వే స్టేషన్ అభివృద్ధి, జాతీయ రహదారి విస్తరణ వంటి పనులు పట్టణ రవాణా, కనెక్టివిటీని మెరుగుపరచనున్నాయని చెప్పారు.

మచిలీపట్నం–విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటు భవిష్యత్తులో ఆరు లేన్ల రహదారిగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కత్తిపూడి–ఒంగోలు కోస్టల్ హైవేతో అనుసంధానం ద్వారా తీర ప్రాంత రవాణా మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

మచిలీపట్నం పోర్టు పనులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైతే పారిశ్రామిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. మెడికల్ కాలేజీ ప్రాంతాన్ని పట్టణంలోని ప్రధాన రహదారులతో అనుసంధానించేలా రహదారి, ఫ్లైఓవర్ నిర్మాణాలపై ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో మచిలీపట్నం నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీమ్ బేగ్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పీవీ ఫణి కుమార్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, కూటమి నాయకులు సుబ్రహ్మణ్యం, గడ్డం రాజు, పంతం గజేంద్ర రావు, సుధాకర్, సుశీల, కుంభ రవి కిరణ్, కీర్తి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review