బాపట్ల:-బాపట్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ క్షీర భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన నవరాత్రి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉత్సవాల ముగింపు పర్వంలో భాగంగా శ్రీ సంపత్ గణపతి నిమజ్జనోత్సవాన్ని భక్తులు అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.

కోలాహలంగా నగరోత్సవం:
శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఆలయ ప్రాంగణం నుండి శ్రీ సంపత్ గణపతి నగరోత్సవం ప్రారంభమైంది. పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి మంగళహారతులు పడుతూ ఘనంగా వీడ్కోలు పలికారు. యాత్ర పొడవునా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.Bapatla City News
సముద్ర తీరంలో శాస్త్రోక్తంగా నిమజ్జనం:
నగరోత్సవం అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని నిమజ్జనం కోసం సమీపంలోని సూర్యలంక బీచ్‌కు తరలించారు. రాత్రి వేళ వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య సముద్ర తీరంలో నిమజ్జన కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తయింది. “గణపతి బప్పా మోరియా, మోదక ప్రియా మోరియా” అంటూ భక్తులు చేసిన జయఘోషలతో సూర్యలంక తీరం మారుమోగింది.

పక్కాగా భద్రతా ఏర్పాట్లు:
ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా స్థానిక పోలీస్ శాఖ తగిన సహాయ సహకారాలు అందించింది. సూర్యలంక తీరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.



