పల్నాడు జిల్లా: నరసరావుపేట:-పుట్టుకతో వినికిడి, సంభాషణ లోపంతో బాధపడుతున్న ఒక చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూ, పల్నాడు జిల్లా నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులోని డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్స్‌లో మంగళవారం 110వ కాక్లియర్ ఇంప్లాంట్ ‘స్విచ్-ఆన్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రముఖ ఈఎన్‌టీ, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ డాక్టర్ రాజేష్ వేపూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం పాతకోటి గ్రామానికి చెందిన శ్రీను కుమార్తె పుట్టుకతోనే మూగ-చెవిటితనంతో బాధపడుతోంది. చిన్నారి పరిస్థితిని గుర్తించిన డాక్టర్ రాజేష్ వేపూరి బృందం, ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స పూర్తి చేశారు. సర్జరీ అనంతరం గాయం మానడంతో, మంగళవారం ఇంప్లాంట్‌ను యాక్టివేట్ (స్విచ్-ఆన్) చేశారు. ఆ పరికరం ఆన్ చేయగానే చిన్నారి తొలిసారిగా శబ్దాలను విని భావోద్వేగానికి గురికావడం, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులను, వైద్య సిబ్బందిని ఎంతగానో కదిలించింది.
ఆధునిక పరిజ్ఞానంతో క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతం: ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ వేపూరి మాట్లాడుతూ.. గత నాలుగేళ్లలో తమ ఆసుపత్రిలో 110 కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను 99 శాతం విజయవంతమైన ఫలితాలతో పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ చిన్నారి కేసు అత్యంత క్లిష్టమైనదని, చెవిలోని కాక్లియా భాగం పూర్తిగా మూసుకుపోయినప్పటికీ అత్యాధునిక సాంకేతికతతో ఆపరేషన్ విజయవంతం చేశామని తెలిపారు. ఇందుకోసం అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ₹1.25 కోట్ల విలువైన హైఎండ్ సర్జికల్ మైక్రోస్కోప్, ₹10 లక్షల విలువైన అడ్వాన్స్‌డ్ డ్రిల్లింగ్ సిస్టమ్ ఉపయోగించినట్లు ఆయన వివరించారు.
కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలో ‘స్విచ్-ఆన్’ అత్యంత కీలకమైన ఘట్టమని, మొదటిసారి శబ్దాలు వినిపించినప్పుడు పిల్లలు భయపడటం లేదా ఏడవడం సహజమని తెలిపారు. రాబోయే రోజుల్లో మ్యాపింగ్, స్పీచ్ థెరపీ, హియరింగ్ ట్రైనింగ్ ద్వారా చిన్నారి సాధారణంగా మాట్లాడే స్థాయికి చేరుకుంటుందని, ఇందులో తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమని స్పష్టం చేశారు.
ఉచితంగా వైద్యం అందించిన డాక్టర్లకు కృతజ్ఞతలు: చిన్నారి తండ్రి శ్రీను మాట్లాడుతూ.. బయట ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్సకు సుమారు ₹6 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారని, కానీ డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్‌లో ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్ చేసి తమ పాపకు వినికిడి శక్తిని ప్రసాదించిన డాక్టర్ రాజేష్ వేపూరితో పాటు ఆసుపత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్యసేవ, ఎల్‌ఓసీ, ఈఎస్‌ఐ/ఈహెచ్‌ఎస్‌తో పాటు వివిధ ఆరోగ్య బీమా పథకాల ద్వారా ఈ సేవలను ఉచితంగా లేదా రాయితీపై అందిస్తున్నట్లు ఆసుపత్రి అధినేత శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.



