కనిగిరి (మార్కాపురం జిల్లా), సెప్టెంబర్ 27: మహిళల ఆర్థిక స్వశక్తికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యమిస్తూ “జననీ చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 304 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. స్థానిక కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది.
ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. వారితో పాటు ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఆంధ్రా మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొని లబ్ధిదారులకు ఉచిత కుట్టు మిషన్లను అందజేశారు.

కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా ఆర్&బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ… మహిళలకు కేవలం నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా, స్వయం ఉపాధికి అవసరమైన వనరులను కూడా కల్పిస్తే వారు ఆర్థికంగా మరింత ముందుకు వెళ్తారని ఆకాంక్షించారు. ట్రస్ట్ ద్వారా పొందిన ఈ కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుంటూ, నిలదొక్కుకుని తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని ఈ సందర్భంగా మహిళలకు పిలుపునిచ్చారు.మార్కాపురం
సమాజంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని హాజరైన పలువురు నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, లబ్ధిదారులు, గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



