గుంటూరు (ప్రత్యేక ప్రతినిధి):-నగర సుందరీకరణకు శ్రీకారం చుడుతూ గుంటూరు నగర పాలక సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నగర అందాలను పెంచడంతో పాటు, స్థానికుల్లో నగరం పట్ల గర్వాన్ని పెంపొందించే లక్ష్యంతో 8 ముఖ్యమైన ప్రాంతాల్లో “ఐ లవ్ గుంటూరు”, “మన గుంటూరు” పేరుతో ప్రత్యేక స్వాగత బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరుకు వచ్చేవారికి, నిత్యం ప్రయాణించే స్థానికులకు నగరంలో అడుగుపెట్టగానే ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
తొలి దశలో గాంధీ పార్క్ వద్ద… ఈ ప్రాజెక్ట్ తొలి దశ పనులను గాంధీ పార్క్ ప్రధాన గేట్ వద్ద బోర్డు ఏర్పాటుతో ఇప్పటికే ప్రారంభించామన్నారు. అలాగే గుంటూరు మిర్చి విశిష్టతను ప్రతిబింబించేలా పొన్నూరు రోడ్డు ప్రవేశ మార్గంలో “గుంటూరు – చిల్లీస్ సిటీ ఆఫ్ ఇండియా” పేరిట ప్రత్యేక బోర్డును సిద్ధం చేసినట్లు వివరించారు.

మిగిలిన ప్రాంతాలు ఇవే:
- ఆటో నగర్ వై-జంక్షన్
- నంది వెలుగు ఆర్.ఓ.బి వద్దగల మానస సరోవరం పార్క్
- గుజ్జనగుండ్ల జంక్షన్
- అమరావతి రోడ్డు
- కోరిటెపాడు పార్క్ జంక్షన్
- ప్రధాన నగర ప్రవేశ మార్గాలు

రాత్రి వేళల్లో ఆకట్టుకునేలా ‘సెల్ఫీ పాయింట్లు’: రాత్రి సమయంలో ప్రత్యేక వెలుగులు చిమ్మేలా వినూత్న డిజైన్లతో ఈ బోర్డులను తీర్చిదిద్దుతున్నామని, ఇవి పర్యాటకులకు, స్థానికులకు అద్భుతమైన ‘సెల్ఫీ పాయింట్లు’గా మారతాయని కమిషనర్ ధీమా వ్యక్తం చేశారు. నగర శోభను మరింత పెంచేందుకు చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి పౌరులందరూ సహకరించి, ఈ బోర్డుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.



