దర్శి:– భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని గుజ్జుల సరళాదేవి భవన్‌లో సోమవారం ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 119వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి మాట్లాడుతూ.. భగత్‌సింగ్ చిన్న వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడని అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్ర్యం లభించాలన్నదే భగత్‌సింగ్ ఆకాంక్ష అని కరుణానిధి తెలిపారు. ఆయన పోరాట స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఎస్‌ఐఆర్ పేరుతో అర్హులైన పౌరుల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని కరుణానిధి ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి ఎన్నికల వ్యవస్థపై విశ్వాసాన్ని కాపాడాలని కోరారు.
ఈ వ్యవహారంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని కరుణానిధి డిమాండ్ చేశారు.Prakasam District City News
ఏఐఎస్ఎఫ్ దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జి. స్టాలిన్ మాట్లాడుతూ.. భగత్‌సింగ్ ఆశయాల సాధనతో పాటు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాయకులు చైతన్య, నరేంద్ర, విద్యాధర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.



