palnadu District city news :నరసరావుపేటలో కలకలం రేపిన హత్య కేసు ఛేదన-సైకో కిల్లర్ అరెస్ట్

S Sarath
1 View

పల్నాడు జిల్లా (నరసరావుపేట), అక్టోబర్ 5:– నరసరావుపేట పట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసును ఒకటో పట్టణ పోలీసులు అత్యంత వేగంగా ఛేదించారు. గాంధీ పార్కు వద్ద నిద్రిస్తున్న వ్యక్తిని బండరాయితో మోది కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి వెల్లడించారు.

సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు:Palnadu distric News

ఘటన నేపథ్యం: గత సెప్టెంబరు 29 తెల్లవారుజామున గాంధీ పార్కు ఎదురుగా ఉన్న కాసు కాంప్లెక్స్‌ వద్ద నిద్రిస్తున్న గాసి రాజేష్‌ (35) అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుడు బండరాయితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.

సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు: కేసును సవాలుగా తీసుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలంలో లభించిన భౌతిక సాక్ష్యాలు, సాంకేతిక ఆధారాల (CCTV, సైబర్ సెల్) సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ హత్యకు పాల్పడింది బరంపేటకు చెందిన కసుకుర్తి నిఖిల్‌ (30)గా గుర్తించి, సోమవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

వికృత ఆలోచనలే కారణం – పాత నేరస్థుడిగా గుర్తింపు: విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు నిఖిల్‌కు ఉన్న వికృత ఆలోచనల (సైకో ప్రవృత్తి) కారణంగానే రాత్రివేళల్లో ఒంటరిగా నిద్రించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా, 2018లో జరిగిన మరో హత్య కేసులోనూ ఇతనికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఆధారాలు స్వాధీనం: నిందితుడి వద్ద నుంచి రెండు హత్యల ఘటనలకు సంబంధించిన కత్తెరలు, ప్రస్తుత హత్య సమయంలో ధరించిన రక్తపు మరకల దుస్తులతో పాటు, 2018 నాటి ఘటనలో ఉపయోగించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీస్ సిబ్బందికి అభినందనలు: కేసును త్వరితగతిన ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ ఎం.హనుమంతరావు, సీఐ ఎస్‌.కె.టి.ఫిరోజ్‌, ఎస్సై వంశీకృష్ణలతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Author
Share This Article
Leave a review