GUNTUR DISTRICT NEWS: ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలి

Karthik

ఉత్తమ స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ పిలుపునిచ్చారు. సాధారణ పురపాలక ఎన్నికలపై  సన్నాహక చర్యలలో భాగంగా గుంటూరులో ప్రాంతీయ సమాయత్త సమావేశం గుంటూరు వైద్య కళాశాల ఆడిటోరియంలో మంగళవారం జరిగింది. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, నోటిఫికేషన్ కు ముందుగానే పనులు చేపట్టడం వలన ఎన్నికల సమయంలో పనులు సులభతరం కాగలదని పేర్కొన్నారు. అందుకే ముందుగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగం, ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మాత్రమే ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్దేశకాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. చిన్న తప్పులు కూడా పెద్ద శిక్షలకు దారి తీసే అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహణ జరగాలని అన్నారు. ప్రజల విశ్వాసం చూరగొనాలని పేర్కొన్నారు. ఉత్తమ స్థాయిలో ఎన్నికలు జరగాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్ లు పోలింగ్ కేంద్రాలను స్వయంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఓటు పట్ల ఎవరికి ఎటువంటి సందేహాలు లేకుండా సమాచారం అందించాలని అన్నారు. మున్సిపల్ పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్ పి.సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా జరపాలని అన్నారు. అధికారులు ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు తావివ్వకుండా సమగ్ర సన్నాహాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మేయర్ లు, మున్సిపల్ చైర్ పర్సన్ ల ఎన్నికలు ప్రత్యక్షంగా జరగనున్నాయని, మార్పులను గమనిస్తూ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని అన్నారు. ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పుల ప్రక్రియను నిశితంగా పరిశీలించి, ఎలాంటి తప్పులు లేని పక్కా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని సూచించారు. పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, ముందస్తుగా తనిఖీలు చేపట్టాలన్నారు. నియమావళి ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct),  గ్రీన్ కోడ్‌ను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటిస్తే తక్కువ సమయంలో ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంటుందని, అందుకు సిద్ధంగా సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల సున్నితత్వం గమనించాలని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిర్దేశకాల పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. చిన్న అంశాలు కదా అనే అపోహలతో దేనిని నిబంధనలకు విరుద్ధంగా చేయరాదని అన్నారు. ఎటువంటి సందేహాలు లేకుండా నిబంధనలు చదవాలని సూచించారు. స్టేట్యుటరీ, నాన్ స్టేట్యుటరీ అంశాలు పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారికి అందించే “హ్యాండ్ బుక్” లోని అంశాలు పట్ల సంపూర్ణ ఙ్ఞానం ఉండాలని స్పష్టం చేశారు. సజావుగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహణకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాలెట్ పెట్టెల ద్వారా ఎన్నికలు జరుగుతాయని గుర్తించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాలు నుండి ప్రతి అంశం పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఓటరు జాబిత సైతం పరిశీలన చేయాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముందుగానే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనవసర వదంతులు గమనించి తక్షణం స్పందించి వాటికి స్పష్టత ఇవ్వాలని చెప్పారు. మున్సిపల్ శాఖ ప్రాంతీయ సంచాలకులు సూర్యదేవర హరికృష్ణ మాట్లాడుతూ గుంటూరు ప్రాంతంలో 33 మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 24 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు మిగిలిన మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహణ ఉంటుందన్నారు. పొరపాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించుటకు అందరూ సమాయత్తం కావాలని కోరారు. మున్సిపల్ శాఖ జాయింట్ డైరెక్టర్ రవీంద్ర బాబు మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు ముందు, ఎన్నికల సమయంలోనూ, ఎన్నికల అనంతరం నిర్వహించాల్సిన అంశాలు పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు (ROs), అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROs), వివిధ శాఖల ప్రతినిధులు హాజరయ్యారు.

Author
Share This Article
Leave a review