Bapatla:-గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ కళాపీఠం రచయిత, వ్యవస్థాపకుడు చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజలకు విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు సకాలంలో అందేలా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ఢిల్లీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న వైద్య సమస్యలపై చర్చ జరిగినట్లు తెలిపారు. రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు, ప్రైవేట్ వైద్యులు తమ వంతు సేవలు అందిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదన్నారు.
నవ్యాంధ్రప్రదేశ్లో 28 జిల్లాలు, 688 మండలాలు, 13,351 గ్రామపంచాయతీలు ఉన్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో 1,278 ప్రభుత్వ ఆసుపత్రులు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 288 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలో వైద్యుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల లభ్యత, అత్యవసర సమయాల్లో తక్షణ చికిత్స అందించే వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందన్నారు.Bapatla District City news
తనకు ఇటీవల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గుంటూరులోని శ్రీ వైష్ణవి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నట్లు చండ్ర ప్రసాద్ తెలిపారు. బీపీ, షుగర్ అధికంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటూ మందులు వాడినట్లు చెప్పారు. అనంతరం వినాయక స్వామి పూజా కార్యక్రమాల నేపథ్యంలో అద్దంకి సమీపంలోని పోలవరం గ్రామంలో సుమారు 12 రోజులపాటు ఉన్నట్లు వివరించారు.
సుమారు 3,500 జనాభా ఉన్న పోలవరం గ్రామంలోని పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్ శరణ్య, ఆశా వర్కర్ శ్రీలత ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది ప్రజలతో మమేకమై సేవలు అందించడం అభినందనీయమన్నారు. అయితే సెలవు రోజుల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రజలకు తక్షణ వైద్యం అందే పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాన్ని ప్రభుత్వాలు పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
పోలవరం గ్రామం దర్శి నియోజకవర్గ పరిధిలోని ముండ్లమూరు మండలానికి చెందినదని, ముండ్లమూరు, దర్శి, అద్దంకి ప్రాంతాల్లో అత్యవసర వైద్య సదుపాయాలు పరిమితంగా ఉండటంతో ఒంగోలు వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాత్రి వేళల్లో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్న సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా సమస్యలు ఉన్నాయని, అక్కడి ప్రజలు వైద్యం కోసం పడుతున్న ఇబ్బందులను పాలకులు ప్రత్యేకంగా పరిశీలించాలని కోరారు. ప్రజాప్రతినిధులు అనారోగ్యానికి గురైతే అత్యవసర వైద్య సదుపాయాలు వేగంగా అందుబాటులోకి వస్తున్నప్పటికీ సామాన్య ప్రజలకు కూడా అదే స్థాయిలో వైద్య సేవలు అందేలా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
60 సంవత్సరాలు దాటిన వారికి హెల్త్ కార్డులు అందించడం మాత్రమే కాకుండా, ఆకస్మికంగా వచ్చే ఆరోగ్య సమస్యలకు గ్రామీణ స్థాయిలోనే వేగవంతమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర వైద్యం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆసుపత్రులు, వైద్యులు, అంబులెన్స్ సౌకర్యాలు, రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.
ఏ వ్యవస్థకైనా సమర్థత, నిబద్ధత, మేధస్సు కలిగిన కార్యసాధకులు అవసరమని చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు. తొండపు దశరథ జనార్దన్ వంటి సమర్థవంతమైన వ్యక్తుల సేవలను ప్రభుత్వం, పార్టీ వ్యవస్థలు ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. సమర్థులైన వ్యక్తులకు తగిన బాధ్యతలు అప్పగిస్తే వ్యవస్థలను సక్రమమైన మార్గంలో నడిపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను వాస్తవ దృష్టితో పరిశీలించి, రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ముఖ్యంగా వైద్య రంగంపై మరింత దృష్టి సారిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని చండ్ర ప్రసాద్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ కళాపీఠం గౌరవ సలహాదారు ఇప్పిలి శైలజకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



