దర్శి:– ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు ఉద్యోగ కార్మికులు ఏడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ గత మూడు రోజులుగా చేపట్టిన సమ్మె బుధవారం సఫలమైంది. కార్మికుల ఆందోళనకు ఏఐవైఎఫ్, ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు మద్దతు ప్రకటించారు.
మూడు రోజులుగా కార్మికులు సమ్మె కొనసాగించడంతో స్పందించిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు యూనియన్ నాయకులను చర్చలకు ఆహ్వానించారు. మంగళవారం, బుధవారం జరిగిన చర్చలు బుధవారం ఫలించడంతో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఒప్పందం కుదిరింది.
చర్చల్లో ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఈఈ బి.వి. నాగేశ్వరరావు, దర్శి డీఈ కే. శ్రీనివాసరావు, దర్శి ఈఈ ఏ. హనుమాన్ బాబు, తాళ్లూరు ఈఈ ఎస్. వలిబాబు పాల్గొన్నారు. కార్మికుల తరఫున దర్శి నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి మండపాకల రమేష్ బాబు, ఏఐటీయూసీ నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు, జిల్లా ఏఐవైఎఫ్ అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి చర్చల్లో పాల్గొన్నారు.
చర్చల్లో భాగంగా కార్మికులకు రావాల్సిన ఏడు నెలల పెండింగ్ వేతనాల్లో కొంత మొత్తాన్ని రెండు రోజుల్లో నగదు రూపంలో చెల్లిస్తామని, మిగిలిన మొత్తాన్ని కాంట్రాక్టర్ ద్వారా చెక్కు రూపంలో అందజేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్మికుడికి ప్రస్తుతం అందుతున్న నెలవారీ వేతనానికి అదనంగా రూ.3,000 చెల్లించేందుకు అంగీకారం కుదిరింది.Prakasam district News
లేబర్ యాక్ట్ అమలు అంశం కోర్టు పరిధిలో ఉన్నందున, కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రతి ఉద్యోగ కార్మికుడికి లేబర్ యాక్ట్ను అమలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
చర్చల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం లభించడంతో సమ్మె విరమించి బుధవారం నుంచి విధులకు హాజరయ్యారు. తమ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, యూనియన్ నాయకులకు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఒప్పందం కుదరడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.



