Palnadu District News :పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు-ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం-కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ జగదీష్ ఆదహళ్లి

S Sarath
1 View

పల్నాడు జిల్లా, నరసరావుపేట, అక్టోబర్ 15 :-పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి తెలిపారు. గురువారం పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ఇద్దరూ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. గురజాల, మాచర్ల, పెదకూరపాడు, చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

నరసరావుపేట మున్సిపాలిటీకి సంబంధించి కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదని, రెండో దశలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని తెలిపారు. ఎన్నికల నిబంధనల అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చర్యలు తీసుకుంటామని, ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.Palnadu distric News

జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూముల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ముందస్తుగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో అల్లర్లు సృష్టించడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తామని తెలిపారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్, ఎస్పీ స్పష్టం చేశారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు సూచించారు.

Author
Share This Article
Leave a review