ఉయ్యూరు:– మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉయ్యూరు పట్టణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ పరిశీలించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన మొత్తం 9 నామినేషన్ కేంద్రాలను సందర్శించి, అక్కడ చేపట్టిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో అభ్యర్థికి సంబంధించిన ఒక వాహనాన్ని మాత్రమే అనుమతించాలని ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల అధికారి కార్యాలయంలోకి అభ్యర్థి, ప్రతిపాదకుడితో కలిపి గరిష్ఠంగా ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించారు. కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు చేరకుండా చూడటంతో పాటు, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు, వారి అనుచరులు నిర్ణీత ప్రదేశాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల సమయంలో అనుమతులు లేని ర్యాలీలు, ఊరేగింపులు, రహదారుల దిగ్బంధం వంటి చర్యలకు అవకాశం ఇవ్వకూడదని ఎస్పీ సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఓటర్లను బెదిరించడం, ప్రలోభాలకు గురిచేయడం, నగదు లేదా వస్తువుల పంపిణీ వంటి ఎన్నికల నేరాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.Krishna disrtrict News
ఎన్నికల సమయంలో చోటుచేసుకునే చిన్న సంఘటనలను సైతం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించాలని ఎస్పీ సూచించారు. ఎన్నికల అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.



