నరసరావుపేట, అక్టోబర్ 29 :– పార్టీ కార్యకర్తల ఐక్యత, నాయకుల సమష్టి కృషితోనే తెలుగుదేశం పార్టీ విజయాలు సాధిస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పించినా, అభ్యర్థి గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
గురువారం నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో ఉన్న విజయ్‌కుమార్ కల్యాణ మండపంలో కపిలవాయి విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. కార్యకర్తల అంకితభావం, సమష్టి కృషి కారణంగానే నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ విజయాలు సాధించిందన్నారు.
నరసరావుపేటలో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం లేక ప్రతిపక్ష పార్టీలు పోటీకి దూరంగా ఉంటున్నాయని ఎంపీ విమర్శించారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతు పొందేందుకు ప్రయత్నించకుండా అడ్డంకులు సృష్టించడం, కోర్టుల్లో కేసులు వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.Palnadu Local News
కపిలవాయి విజయ్‌కుమార్‌తో తమకు చాలాకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఎంపీ తెలిపారు. ఇప్పటివరకు పరస్పర సహకారంతో, ఎలాంటి మనస్పర్థలకు తావులేకుండా కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ పార్టీ అభివృద్ధి, విజయాల కోసం నాయకులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
పార్టీ నిర్ణయమే శిరోధార్యం
కపిలవాయి విజయ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఎవరికి బాధ్యతలు అప్పగించినా, ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించినా వారి విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాలను గౌరవించడం తమ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు.
తమ తాతలు, తండ్రులు సైతం పార్టీ నిర్ణయాలకు కట్టుబడి, పార్టీ సూచించిన అభ్యర్థుల విజయానికి కృషి చేశారని గుర్తుచేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పార్టీ ఐక్యత, బలోపేతం, అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు.
ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మాట్లాడుతూ పార్టీ విజయాల్లో కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు విభేదాలకు తావివ్వకుండా సమష్టిగా పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ నిర్ణయానికి అనుగుణంగా అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ ఆత్మీయ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



