Tenali City News :పొలాల్లోకి దిగి పంట నష్టాలను పరిశీలించిన కలెక్టర్-వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలతో పంటలను కాపాడుకోవాలి.. నిల్వ నీటిని తక్షణమే బయటకు పంపించాలి

S Sarath
1 View

తెనాలి, అక్టోబరు 29:– అర్నబ్ తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వీచిన బలమైన గాలులకు నేలవాలిన వరి పంటలను జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తెనాలి మండలంలోని సోమసుందరపాలెం, కంచరపాలెం గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

రైతులతో మాట్లాడిన అనంతరం కలెక్టర్ నేరుగా పొలాల్లోకి దిగి నేలవాలిన వరి పంటను పరిశీలించారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా వరి పంట నేలకొరిగిందని, మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి, వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని ఆదేశించారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించిన పద్ధతులను రైతులు పాటించాలని సూచించారు. పొలాల్లో నిల్వ ఉన్న వర్షపు నీటిని తక్షణమే బయటకు పంపించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

జిల్లావ్యాప్తంగా మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు పంటల సంరక్షణపై తగిన అవగాహన కల్పిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. పొలాల్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా పారుదల చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

రైతులకు అండగా ఉండాలి

తుపాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించి, నష్టాల వివరాలతో సమగ్ర నివేదికలు రూపొందించి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలవాలని స్పష్టం చేశారు.Guntur City News

ఈ పర్యటనలో వ్యవసాయ ముఖ్య శాస్త్రవేత్తలు డా. సి.హెచ్. సుజాని రావు, డా. ఎం. రత్నం, డా. ఎన్. సాంబశివరావు పాల్గొని పంటల సంరక్షణకు సంబంధించి రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీరమణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎం. పద్మావతి, తహసీల్దార్ గోపాలకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review