Guntur District City News :ఎన్నికల ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలి-స్ట్రాంగ్ రూమ్‌లు, పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ సాయికాంత్ వర్మ

S Sarath
1 View

గుంటూరు, అక్టోబర్ 29:- స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. గురువారం తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల కేంద్రాలను ఆయన తనిఖీ చేసి, ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

తెనాలి పురపాలక సంఘం ఎన్నికల సామగ్రి స్వీకరణ, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ ఏర్పాట్లను వి.ఎస్.ఆర్. కళాశాలలో చేపడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి తెనాలి డివిజన్ పరిధిలోని స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కూడా ఇదే కళాశాలలో ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులో ఉండాలని, ఏ సామగ్రికి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు), ఇతర సిబ్బంది హాజరును పర్యవేక్షించాలని సూచించారు. రూట్ల వారీగా వాహనాలను సిద్ధంగా ఉంచాలని, ఎన్నికల సిబ్బందికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని ఆదేశించారు.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు

ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం వద్ద వాహనాల రాకపోకలకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలని కలెక్టర్ సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బంది వాహనాల నుంచి దిగిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా రిసెప్షన్ కౌంటర్‌లో సామగ్రిని అప్పగించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటర్ల వద్ద తగినంత సిబ్బందిని నియమించి, ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు.

స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు హాళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు పకడ్బందీగా ఉండాలని, మీడియా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కౌంటర్ వద్ద ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.Guntur City News

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగికి ఓటు వేసే అవకాశం కల్పించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ తనిఖీలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీరమణి, తెనాలి పురపాలక సంఘం కమిషనర్ జె. రామ అప్పలనాయుడు, తహసీల్దార్ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review