Guntur City News : తేలు కుట్టిందని నిర్లక్ష్యం చేయొద్దు.. వెంటనే వైద్యులను సంప్రదించాలి-15 ఏళ్ల బాలికకు ప్రాణాపాయం.. జీజీహెచ్ వైద్యుల సమయస్ఫూర్తితో ప్రాణరక్షణ

S Sarath
3 Views

గుంటూరు, అక్టోబర్ 29:– తేలు కుట్టడాన్ని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని, వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్స పొందాలని గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ దుర్గాప్రసాద్ సూచించారు. తేలు విష ప్రభావంతో గుండె పనితీరు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్న 15 ఏళ్ల బాలికకు జీజీహెచ్ వైద్యులు సమర్థవంతమైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడినట్లు తెలిపారు.

32 శాతానికి పడిపోయిన గుండె పనితీరు

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నరసయ్యపాలెం గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఈ నెల 22న పొలం పనులు చేస్తుండగా తేలు కుట్టింది. కొద్దిసేపటికే తీవ్రమైన ఆయాసం, గుండెదడ వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలిక గుండె పంపింగ్ సామర్థ్యం కేవలం 32 శాతానికి పడిపోయినట్లు, గుండె కండరాల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.

ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు ఈ నెల 23న బాలికను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించే ప్రమాదం ఉండటంతో జనరల్ మెడిసిన్ విభాగం వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. ఇంటెన్సివ్ కేర్ విభాగంలో పీజీ వైద్యులు, ఐసీయూ నర్సింగ్ సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందించారు.

నిరంతర పర్యవేక్షణతో సాధారణ స్థాయికి గుండె పనితీరు

బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసేందుకు వరుసగా ఈసీజీ, ఎకో పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరినట్లు గుర్తించిన వైద్యులు పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందించారు. వైద్య బృందం సమిష్టి కృషి, నిరంతర పర్యవేక్షణ ఫలితంగా బాలిక గుండె పంపింగ్ సామర్థ్యం క్రమంగా మెరుగుపడింది.Guntur City News

మొదట 32 శాతంగా ఉన్న గుండె పంపింగ్ సామర్థ్యం 42 శాతానికి చేరి, అనంతరం 60 శాతానికి మెరుగుపడింది. దీంతో బాలిక గుండె పనితీరు సాధారణ స్థాయికి చేరుకోవడం వైద్యులకు ఊరటనిచ్చింది. సకాలంలో అందించిన వైద్యం వల్లే బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.

నాటు వైద్యం, ఇంటి చిట్కాలతో సమయం వృథా చేయొద్దు

కొన్ని సందర్భాల్లో తేలు విష ప్రభావం గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపి ప్రాణాపాయ పరిస్థితులకు దారితీయవచ్చని డాక్టర్ దుర్గాప్రసాద్ హెచ్చరించారు. తేలు కుట్టిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. నాటు వైద్యం, ఇంటి చిట్కాలను ఆశ్రయిస్తూ విలువైన సమయాన్ని వృథా చేయవద్దని స్పష్టం చేశారు.Guntur City News

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య బృందాలు నిరంతరం కృషి చేస్తున్నాయని తెలిపారు. బాలికకు సమర్థవంతంగా చికిత్స అందించిన జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఉషారాణి, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ విన్నీ డయానా, డాక్టర్ వి. అనిల్ కుమార్‌తో పాటు పీజీ వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని డాక్టర్ దుర్గాప్రసాద్ అభినందించారు.

Author
Share This Article
Leave a review