Eluru district news :శోభనాపురం సొసైటీ తీరుపై రైతు ఆగ్రహం- అప్పు తీర్చినా దస్తావేజులు ఇవ్వకపోవడంపై మండిపాటు

Sharat
1 View

ఆగిరిపల్లి (ఏలూరు జిల్లా): – అప్పు తీర్చేసినా దస్తావేజులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (KDCC) అధికారుల నిర్లక్ష్యంపై ఓ రైతు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.

శోభనాపురం సొసైటీ పరిధిలోని KDCC బ్యాంక్‌లో గ్రామానికి చెందిన రైతు నక్కనబోయిన కృష్ణ తన పొలం ఒరిజినల్ దస్తావేజులను తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. సదరు రుణ మొత్తాన్ని 2024లోనే పూర్తిగా చెల్లించగా, దానికి సంబంధించిన రసీదులు కూడా ఆయన వద్ద ఉన్నాయి. అయితే, రుణం పూర్తిగా చెల్లించి రెండేళ్లు కావస్తున్నా అధికారులు మాత్రం దస్తావేజులు, NOC ఇవ్వకుండా తనను చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. “అప్పు తీసుకోవడమే నేరమా? రుణం తీర్చేసినా పత్రాల కోసం బ్యాంక్ చుట్టూ తిరగాలా?” అని ఆయన ప్రశ్నించారు.

RBI నిబంధనలు బేఖాతరు: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం… రుణం పూర్తిగా చెల్లించిన 30 రోజుల్లోపు బ్యాంకులు ఒరిజినల్ దస్తావేజులతో పాటు NOCని రైతుకు అప్పగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం చేస్తే రోజుకు 5,000 రూపాయల చొప్పున బ్యాంక్ పరిహారం చెల్లించాలి. కానీ శోభనాపురం సొసైటీ, KDCC బ్యాంక్ అధికారులు మాత్రం ఈ నిబంధనలను బొందపెట్టి రైతును వేధింపులకు గురిచేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.Eluru District news

చేతిలో రసీదులు ఉండి, అప్పు మొత్తం తీర్చినా సొంత పొలం పత్రాల కోసం రైతు అల్లలాడాల్సి రావడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. వెంటనే జిల్లా సహకార శాఖ అధికారులు, KDCC ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రైతు నక్కనబోయిన కృష్ణకు న్యాయం చేయాలని, ఆయన దస్తావేజులు, NOC తక్షణమే అందజేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Author
Share This Article
Leave a review