గుంటూరు, అక్టోబర్ 23:-మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫోటో ఓటరు స్లిప్పుల పంపిణీని వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సి.యం. సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఓటరు స్లిప్పులను ముందుగానే సిద్ధం చేసి పంపిణీకి అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మున్సిపాలిటీల్లో వార్డుల డీలిమిటేషన్ కారణంగా కొంతమంది ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి క్యూ ఆర్ కోడ్లతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లు తమ ఓటు వివరాలను సులభంగా తెలుసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు శుక్రవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నందున రిటర్నింగ్ అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. హెల్ప్‌డెస్క్‌లను మరింత క్రియాశీలంగా నిర్వహించాలని, శిక్షణ పొందిన సిబ్బందిని విధుల్లో వినియోగించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు.
నిర్ణీత సమయంలో నామినేషన్ల కోసం వచ్చే అభ్యర్థులకు టోకెన్లు జారీ చేయాలని, నామినేషన్ల స్వీకరణ పూర్తయిన వెంటనే పరిశీలన ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
శుక్రవారం పీఓలు, ఏపీఓలకు శిక్షణ
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రిసైడింగ్ అధికారులు (పీఓలు), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓలు)కు మొదటి విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభం కానుందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత సిబ్బంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని స్పష్టం చేశారు. శిక్షణకు గైర్హాజరయ్యే సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
24, 25 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించేందుకు ఈ నెల 24, 25 తేదీల్లో ఫెసిలిటేషన్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని తెనాలి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.
సాధారణ పరిశీలకుడు వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ ఓటరు స్లిప్పుల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించి, వందశాతం పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు.
వ్యయ పరిశీలకురాలు నందిని సలారియా మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.Guntur City News
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు
పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎన్నికల ర్యాలీలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని, నిబంధనల ఉల్లంఘన జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి. రమణమూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి. జ్యోతిబసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగసాయి కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి కె. శ్రీనివాసరావు, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు.



