గుంటూరు, నవంబరు 5:– మురసు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గురువారం 354 వైద్య శిబిరాలను నిర్వహించి 2,508 మందికి వైద్య సేవలు అందించినట్లు జిల్లా కలెక్టర్ సి.ఎం. సాయికాంత్ వర్మ తెలిపారు.
గుంటూరు రూరల్ మండలం లాలుపురం గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ప్రబలే అవకాశాలు ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
గురువారం గ్రామీణ ప్రాంతాల్లో 229, పట్టణ ప్రాంతాల్లో 125 వెరసి 354 వైద్య శిబిరాలు నిర్వహించి 2,508 మందికి వైద్య సేవలు అందించామన్నారు. బుధవారం గ్రామీణ ప్రాంతాల్లో 221, పట్టణ ప్రాంతాల్లో 82 కలిపి మొత్తం 303 వైద్య శిబిరాలు నిర్వహించి 3,028 మందికి వైద్య సేవలు అందించినట్లు వివరించారు.Guntur City News
అలాగే ఎనిమిది పునరావాస కేంద్రాల్లోనూ వైద్య సేవలు అందించామని, గురువారం అప్పాపురం పునరావాస కేంద్రంలో వైద్య శిబిరాన్ని కొనసాగించినట్లు తెలిపారు. తుఫాను అనంతరం వ్యాధులు ప్రబలకుండా ఇప్పటికే తాగునీటి పథకాలకు క్లోరినేషన్ చేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రజలు మరికొన్ని రోజులపాటు తాగునీరు, పరిసరాల పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే వినియోగించాలని కోరారు. వైద్యులు, వైద్య సిబ్బంది తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అందిస్తున్న సేవలను కలెక్టర్ అభినందించారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వైద్య శిబిరాలు
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించిన 724 కేంద్రాల్లోనూ గురువారం వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలు అందించినట్లు కలెక్టర్ తెలిపారు. బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ నెల 7వ తేదీన తెనాలి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలు కొనసాగిస్తామని తెలిపారు.
తుఫాను ప్రభావిత గ్రామాలతో పాటు పునరావాస కేంద్రాల్లోనూ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన వైద్య సేవలను వారి వద్దకే చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.



