Guntur District City News :ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి-ప్లాస్టిక్‌ కాలుష్యంతో ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు-తెనాలి జిల్లా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం

S Sarath
1 View

తెనాలి, నవంబర్ 5:- ఒక్కసారి వినియోగించి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులకు ప్రజలు స్వస్తి పలకాలని, వాటి స్థానంలో పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. బ్రిక్స్‌ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా నవంబర్‌ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా నవంబర్‌ 4న తెనాలి జిల్లా ఆసుపత్రిలో ‘ఒక్కసారి వాడే ప్లాస్టిక్‌కు నో చెప్పాలి’ అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బ్రిక్స్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి డాక్టర్‌ జె. విజయలక్ష్మి పాల్గొని రోగులు, ఆసుపత్రి సిబ్బంది, సందర్శకులకు ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువుల వల్ల మానవ ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

రాష్ట్ర సమీక్షా బృంద సభ్యులు డాక్టర్‌ గీతా పద్మజ (పీఎంఎన్‌డీపీ), జ్యోతి (రాష్ట్ర నాణ్యతా సలహాదారు), డాక్టర్‌ స్టెఫీ గ్రేస్‌ (స్వస్తి సంస్థ సామర్థ్య అభివృద్ధి విభాగం) కార్యక్రమంలో పాల్గొన్నారు. తెనాలి జిల్లా ఆసుపత్రి వైద్య పర్యవేక్షకురాలు డాక్టర్‌ సౌభాగ్యవాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అన్నపూర్ణ, డీపీఎంఓ డాక్టర్‌ సుజాత, డీపీఓ డాక్టర్‌ సైమన్‌, గుంటూరు జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, సిబ్బందితో బృందం మాట్లాడి ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించుకునే వస్తువులను అలవాటు చేసుకోవడం, వ్యర్థాలను సరైన పద్ధతిలో నిర్వహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించింది. ప్లాస్టిక్‌ వస్తువులకు బదులుగా పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించింది.Guntur City News

ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని అరికట్టేందుకు వ్యక్తిగత బాధ్యతతో పాటు సమష్టి కృషి అవసరమని అధికారులు స్పష్టం చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని నిర్మించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. సుస్థిర జీవనశైలి అలవాట్లను ప్రజల్లో పెంపొందించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు.

Author
Share This Article
Leave a review