భీమవరం, నవంబరు 5:– అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి, గృహ విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఏపీఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. తుపాను కారణంగా విద్యుత్ శాఖకు జరిగిన నష్టం, పునరుద్ధరణ పనుల పురోగతిపై గురువారం భీమవరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన 98 విద్యుత్ ఉపకేంద్రాల్లో పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు. ప్రభావితమైన 67, 33 కేవీ విద్యుత్ లైన్లలో 65 లైన్లను పునరుద్ధరించగా, మిగిలిన రెండు లైన్ల పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. అదేవిధంగా 475, 11 కేవీ విద్యుత్ లైన్లలో 472 లైన్లను పునరుద్ధరించామని, మిగిలిన మూడు లైన్లను గురువారం సాయంత్రానికి పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
తుపాను ధాటికి నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను తొలగించడం, విద్యుత్ లైన్లపై పడిన చెట్లను తొలగించడం, దెబ్బతిన్న లైన్ల స్థానంలో కొత్త లైన్ల ఏర్పాటు వంటి పనులను పెద్దఎత్తున చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బందితో పాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యుత్ సిబ్బంది సైతం పునరుద్ధరణ కార్యక్రమాల్లో పాల్గొని సహకరించారని పేర్కొన్నారు.
జిల్లాలో తుపాను ప్రభావానికి గురైన ఆరు విద్యుత్ విభాగాలు, 20 మండలాల పరిధిలోని 409 గ్రామాల్లో గృహ విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు స్పష్టం చేశారు. 17,584 ప్రభావిత ఆక్వా విద్యుత్ సర్వీసులకు గాను ఇప్పటివరకు 14,595 సర్వీసులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించామని తెలిపారు. మిగిలిన 2,989 ఆక్వా సర్వీసులతో పాటు వ్యవసాయ విద్యుత్ సర్వీసులకు కూడా రానున్న ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ అందిస్తామని వివరించారు.West godhavari distric news
విద్యుత్ పునరుద్ధరణ పనుల కోసం జిల్లావ్యాప్తంగా 226 బృందాలను ఏర్పాటు చేసి, మొత్తం 3,254 మంది అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించినట్లు తెలిపారు. నిరంతరం క్షేత్రస్థాయిలో పనిచేస్తూ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తుపాను కారణంగా విద్యుత్ రంగానికి ప్రాథమిక అంచనా ప్రకారం రూ.50.49 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ముందస్తు జాగ్రత్తలు, సమన్వయ చర్యల కారణంగా ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ అధికారులు, సిబ్బంది సమన్వయంతో అహర్నిశలు శ్రమించి గృహ విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించారని సీఎండీ అభినందించారు. విద్యుత్ అంతరాయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను వీలైనంత త్వరగా తొలగించేందుకు సిబ్బంది అంకితభావంతో పనిచేశారని తెలిపారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన నెంబర్లు:
- పశ్చిమగోదావరి జిల్లా కాల్ సెంటర్: 9490610152
- భీమవరం డివిజన్: 9493177646
- నరసాపురం డివిజన్: 7382050943
- తాడేపల్లిగూడెం డివిజన్: 9493177806
జిల్లాలో ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు లేదా ఇతర సమస్యలు తలెత్తితే పై ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని, సంబంధిత సిబ్బంది వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారని సీఎండీ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, అర్నబ్ తుపాను కారణంగా జిల్లాలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల తక్కువ సమయంలోనే పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తయ్యాయని తెలిపారు. తుపాను సమయంలో విద్యుత్ శాఖ సిబ్బంది చూపిన అంకితభావం, సమర్థత అభినందనీయమన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారని ప్రశంసించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ, విద్యుత్ శాఖ డైరెక్టర్ సూర్య ప్రకాష్, ఎస్ఈ పి. ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.



