Eluru District City News :ఏలూరు జిల్లాలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు-నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్.. అదే రోజు ఫలితాలు

S Sarath
2 Views

ఏలూరు, నవంబర్ 10:– ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 544 గ్రామ పంచాయతీలకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వెల్లడించారు. మొత్తం 5,696 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, ఇందుకోసం 5,821 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మొదటి విడతలో 177 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, టి.నర్సాపురం, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని 177 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో 1,896 వార్డు సభ్యుల స్థానాలకు 1,953 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నవంబర్ 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, 17వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న నామినేషన్ల పరిశీలన, 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లకు అవకాశం కల్పిస్తారు. 20వ తేదీలోగా అప్పీళ్ల పరిష్కారం, 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తిచేసి తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైతే 27న రీపోలింగ్ చేపడతారు.

రెండో విడతలో 194 గ్రామ పంచాయతీలకు పోలింగ్

భీమడోలు, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నిడమర్రు, ఉంగుటూరు, ద్వారకాతిరుమల మండలాల్లోని 194 గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 1,972 వార్డు సభ్యుల స్థానాలకు 2,024 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

నవంబర్ 18న నోటిఫికేషన్ విడుదల చేసి 20వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 21న పరిశీలన, 22న అప్పీళ్లు, 23వ తేదీలోగా అప్పీళ్ల పరిష్కారం చేపడతారు. 24వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. అవసరమైతే 30న రీపోలింగ్ నిర్వహిస్తారు.

మూడో విడతలో 173 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

దెందులూరు, ఏలూరు, పెదపాడు, పెదవేగి, అగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, నూజివీడు మండలాల్లోని 173 గ్రామ పంచాయతీలకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ విడతలో 1,828 వార్డు సభ్యుల స్థానాలకు 1,844 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

నవంబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేసి 23వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల పరిశీలన, 25న అప్పీళ్ల స్వీకరణ, 26వ తేదీలోగా అప్పీళ్ల పరిష్కారం చేపడతారు. 27వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అదే రోజు తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ చేపడతారు.

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు

జిల్లాలో ఇప్పటికే నగరపాలక సంస్థ, పురపాలక సంఘాలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అదే తరహాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.Eluru District City News

ఎన్నికల విధులకు కేటాయించిన సిబ్బందికి అన్ని అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు. నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను వీడియో చిత్రీకరణతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించనున్నారు. ఎన్నికల సందర్భంగా పటిష్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.

Author
Share This Article
Leave a review