స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ మరియు గ్రామ పంచాయతీలల్లో జరుగుతున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కోరారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం (శ్రీనివాసరావుపేట)లో ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన ఎన్డీయే కూటమి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ…*రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ప్రజలు ప్రభుత్వ పాలనను స్వాగతిస్తున్నారని తెలిపారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కూటమి విజయం సాధించడం ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఈ విజయం ద్వారా ఈవీఎంలైనా, బ్యాలెట్ అయినా ప్రజల మద్దతు అభివృద్ధి, సంక్షేమం వైపే ఉందని స్పష్టమైందన్నారు.రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు తుపానులు, వరదల సమయంలోనూ నిరంతర పర్యవేక్షణతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రాణనష్టం జరగకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారని వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి పక్షపాతానికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు అందిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వంలో మాదిరిగా రాజకీయ వివక్ష లేకుండా, అర్హతే ప్రామాణికంగా సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేయాలనే సంకల్పంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు. వైసీపీ నాయకులు రిజర్వేషన్ల ప్రక్రియకు అడ్డంకులు సృష్టించినప్పటికీ బీసీలకు నాయకత్వ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగిందని చెప్పారు. అదే విధంగా మహిళలకు 45 శాతానికి పైగా ప్రాతినిధ్యం కల్పిస్తూ రాజకీయాల్లో వారికి సముచిత స్థానం కల్పించడం అభినందనీయమన్నారు.ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేందుకు కూటమి నాయకులందరూ బాధ్యతాయుతంగా సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. అయితే వైసీపీ నాయకులు కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, సమన్వయ లోపాలు కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు ఇలాంటి రాజకీయాలను గమనించాలని, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.పల్లెలు పట్టణాలకు పట్టు కొమ్మలని, ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. గ్రామ పంచాయతీలకు సమర్థవంతమైన నాయకత్వం వస్తే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గ్రామ పంచాయతీల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.
గ్రామాలకు రావాల్సిన నిధులు సక్రమంగా వినియోగించకపోవడంతో అనేక చోట్ల రోడ్లు, తాగునీరు, చెరువుల అభివృద్ధి వంటి కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒకప్పుడు అభివృద్ధితో కళకళలాడిన గ్రామాలు సైతం గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలతో సతమతమయ్యాయని పేర్కొన్నారు.గుంటూరు నగరపాలక సంస్థలోనూ గత ఐదేళ్లలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, కార్పొరేషన్‌కు నిధులు ఉన్నప్పటికీ వాటిని ప్రజల అవసరాలకు వినియోగించకుండా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన నిధులు పక్కదారి పట్టడంతో నగరంలో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గ్రామాలకు వచ్చే నిధులు సక్రమంగా వినియోగమై, ప్రతి రూపాయి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపై ఉందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతున్న ఈ తరుణంలో గ్రామాల నుంచి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులకు ప్రజలు అత్యధిక మెజారిటీతో మద్దతు అందించి, గ్రామాల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… ఇటీవల జరిగిన గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 64 డివిజన్లలో కూటమి అభ్యర్థులను గెలిపించిన నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్కూటీపై వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతున్నాయని చెప్పారు. పంచాయతీరాజ్ నిధులు ఆయా గ్రామాల అభివృద్ధికే వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నారాయణరెడ్డి మాట్లాడుతూ…*గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 76 డివిజన్లకు గాను 64 డివిజన్లలో కూటమి విజయం సాధించిందని తెలిపారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రతి వార్డులో పర్యటిస్తూ, గ్రీవెన్స్ కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపుతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహక నిధులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గ్రామాలు, పట్టణాల్లో మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి నాయకులు, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.



