విజయవాడ, నవంబర్ 23:– పీఎం సూర్యఘర్ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేసేందుకు విద్యుత్ అధికారులు, సోలార్ వెండార్లు సమన్వయంతో పనిచేయాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి ఆదేశించారు. సోమవారం విజయవాడలోని కార్పొరేట్ కార్యాలయంలో 8 జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ), సోలార్ వెండార్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
83 శాతం పూర్తయిన ఎస్సీ, ఎస్టీ సోలార్ పనులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ సబ్సిడీ పథకానికి అనుసంధానంగా ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ విద్యుత్‌ను వేగంగా అందిస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. పథకం పురోగతి వివరాలను ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు:
- మొత్తం లక్ష్యం: సంస్థ పరిధిలోని 1,91,242 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల ఇళ్లపై 382.48 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ యూనిట్ల ఏర్పాటు.
- ఇప్పటివరకు పూర్తయినవి: నవంబర్ 22 నాటికి 1,58,800 గృహాల్లో (317 మెగావాట్ల సామర్థ్యం) సోలార్ వ్యవస్థల ఏర్పాటు పూర్తయింది.
డిసెంబర్ 15 డెడ్‌లైన్ మిగిలిన గృహాలకు కూడా త్వరితగతిన సోలార్ యూనిట్లు అమర్చేందుకు జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని, రోజువారీగా పనులను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. సోలార్ వెండార్లు తగిన సామగ్రిని సిద్ధం చేసుకుని ఇన్స్టాలేషన్ పనులను వేగవంతం చేయాలని, డిసెంబర్ 15వ తేదీలోగా నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని స్పష్టం చేశారు.
వినియోగదారులకు పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక రాయితీని అర్హులైన వారందరూ వినియోగించుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని సీఎండీ కోరారు. దరఖాస్తు ప్రక్రియ నుంచి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు వరకు వినియోగదారులకు అధికారులు అండగా నిలవాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగంతో ప్రజలకు కరెంట్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.Vijayawada City News
ఈ సమీక్షలో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & హెచ్ఆర్) టీవీఎస్ఎన్ మూర్తి, సీజీఎం (ప్రాజెక్ట్స్) కె. లింగమూర్తి, సీజీఎం (ఐపీసీ) విజయ్ కుమార్‌తో పాటు 8 జిల్లాల అధికారులు, సోలార్ వెండార్లు పాల్గొన్నారు.



