Amaravathi City news :విఐటి-ఏపి విశ్వవిద్యాలయంలో వైభవంగా ఆరవ స్నాతకోత్సవం

Sharat
2 Views

అమరావతి:26-9-2026:- అమరావతిలోని విఐటి-ఏపి విశ్వవిద్యాలయ ఆరవ స్నాతకోత్సవం శనివారం రోజున అత్యంత వైభవంగా జరిగింది. విఐటి విశ్వవిద్యాలయం ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణ మోహన్ ముఖ్య అతిథిగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అకడమిక్ అలయన్సెస్ గ్రూప్ హెడ్ డాక్టర్ సుసీంద్రన్ కె.ఎం. గౌరవ అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి జస్టిస్ బి. కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. స్నాతకోత్సవం అనేది విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పరివర్తన దశ అని పేర్కొన్నారు. విద్యార్థులకు లభించిన జ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలో వారి వ్యక్తిత్వమే నిర్ణయిస్తుందన్నారు. నిజాయితీ, రాజ్యాంగ విలువలు, చట్టపాలన పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలని, సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానవీయ విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

గౌరవ అతిథి డాక్టర్ సుసీంద్రన్ కె.ఎం. మాట్లాడుతూ.. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న జ్ఞానాన్ని పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులకు ఉచిత విద్య, వసతి కల్పించే విఐటి-ఏపి ‘స్టార్స్’ (STARS) పథకాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

విఐటి ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ మాట్లాడుతూ.. అకాడమిక్ ఎక్సలెన్స్‌ను పెంపొందించడంలోనూ, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలోనూ విఐటి ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు.

యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. అరుళ్‌మొళివర్మన్ ప్లేస్‌మెంట్ వివరాలను వెల్లడిస్తూ.. 2026 బ్యాచ్ విద్యార్థుల సగటు వార్షిక వేతనం (Average Package) ₹7 లక్షలు కాగా, అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీ (Highest Package) ₹96.26 లక్షలుగా నమోదైందని తెలిపారు.

ఈ స్నాతకోత్సవంలో 2026 బ్యాచ్‌కి చెందిన మొత్తం 3,877 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. వీరిలో 86 మంది పిహెచ్.డి గ్రహీతలు, 31 మంది గోల్డ్ మెడలిస్టులు, 133 మంది ర్యాంకర్లు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ కాదంబరి ఎస్. విశ్వనాథన్, రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, డీన్ (అకాడెమిక్స్) డాక్టర్ ఎన్. మధుసూధన రావు, డిప్యూటీ డైరెక్టర్ (స్టూడెంట్ వెల్ఫేర్) డాక్టర్ ఖాదీర్ పాషా, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review