జిల్లాలో శిశు మరణాల సంఖ్యను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఎస్. విజయమ్మ సూచించారు. సోమవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిర్వహించిన శిశు మరణ సమీక్ష (సీడీఆర్) సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డీఐఓ) డాక్టర్ సి. రత్న మన్మోహన్, ఏరియా ఆసుపత్రుల గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్లు పాల్గొని జిల్లాలో నమోదైన శిశు మరణాల కేసులను సమీక్షించారు.
ఈ సందర్భంగా నమోదైన ప్రతి శిశు మరణ కేసును సవివరంగా పరిశీలించిన అధికారులు, మరణాలకు దారితీసిన మూల కారణాలను విశ్లేషించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై చర్చించారు.
అధిక ప్రమాదం ఉన్న శిశువులను ప్రారంభ దశలోనే గుర్తించి, వెంటనే నిపుణుల వైద్య సేవలకు రిఫర్ చేయడం, నాణ్యమైన చికిత్స అందించడం, నిరంతర పర్యవేక్షణ చేపట్టడం అత్యంత కీలకమని డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. అలాగే శిశు ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరచేందుకు సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని, ప్రతి కేసుకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని, లోపాలు గుర్తించిన చోట తక్షణ దిద్దుబాటు చర్యలు అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.



