గుంటూరు / విజయవాడ, నవంబర్ 23:– వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు, సీఆర్డీఏ (CRDA) సర్కిళ్ల పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.
క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి: సమావేశంలో భాగంగా విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ వసూళ్లు, లైన్ లాస్ తగ్గింపు, విద్యుత్ భద్రత, సబ్స్టేషన్లు మరియు పంపిణీ వ్యవస్థ పనితీరుపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
కేంద్ర పథకాలను గడువులోగా పూర్తి చేయాలి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజ్లీ యోజన’, ‘పీఎం-కుసుమ్’ (PM-KUSUM), ‘ఆర్డీఎస్ఎస్’ (RDSS) పథకాలతో పాటు నూతన సబ్స్టేషన్ల నిర్మాణ పురోగతిని సీఎండీ పరిశీలించారు. నిర్దేశించిన లక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే రెవెన్యూ వసూళ్లలో మెరుగైన ఫలితాలు సాధిస్తూనే, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
ఇంటి నుంచే కొత్త కనెక్షన్: కొత్త విద్యుత్ సర్వీస్ కనెక్షన్ల కోసం వినియోగదారులు ఇకపై ఈ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని సీఎండీ పుల్లారెడ్డి తెలిపారు. సంస్థ అధికారిక వెబ్సైట్ (www.apcpdcl.in) లేదా APCPDCL మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. వినియోగదారులు ఈ ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకుని సమయాన్ని, శ్రమను ఆదా చేసుకోవాలని సూచించారు.Guntur City News
ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (టెక్నికల్) ఆవుల మురళీకృష్ణ యాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టీవీఎస్ఎన్ మూర్తి, గుంటూరు సర్కిల్ ఎస్ఈ రమేష్, సీఆర్డీఏ సర్కిల్ ఎస్ఈ సుధాకర్, ఏఈఈలు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



