
తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సొంత ఇంటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో వేగం పెంచడంతో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి యుద్ధప్రాతిపదికన సమీక్షలు నిర్వహిస్తున్నారు. సామాన్యుడి గూడు, భూమి హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేస్తున్నారు.
ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్షాలు, స్వపక్ష ప్రజాప్రతినిధులు రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖలకు సంబంధించి అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి ఒక కీలక హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఇబ్బందిని స్వయంగా పర్యవేక్షించి పరిష్కరిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం, నేడు హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక భేటీలకు శ్రీకారం చుట్టారు.
ఈ రోజు ఉదయం నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, మధ్యాహ్నం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల అధికారులతో మంత్రి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలలో జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, నిధుల విడుదల, మరియు అర్హులైన లబ్ధిదారుల ఎంపికపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ‘భూ భారతి’ ద్వారా భూ సమస్యల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని, సామాన్యుడిని ఆఫీసుల చుట్టూ తిప్పకూడదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
: ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను ప్రజలకు చేరవేయడంలో జిల్లాల వారీగా ఉన్న అవరోధాలను తొలగించడమే ఈ సమీక్షల ప్రధాన ఉద్దేశం. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను కలెక్టర్ల ద్వారా తెలుసుకుని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలను మంత్రి సూచిస్తున్నారు. అటు ఇళ్ల నిర్మాణం, ఇటు భూ సమస్యల పరిష్కారంపై మంత్రి పొంగులేటి చూపుతున్న ఈ చొరవ నిరుపేదల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలతో మొదలైన ఈ ప్రక్రియ.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సమీక్షలు స్పష్టం చేస్తున్నాయి.


