దర్శి: ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు ఆల్బెండజోల్ మాత్రలను అందించి మింగించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు మధ్యాహ్నం ఆల్బెండజోల్ మాత్రలను ఆరోగ్య సిబ్బంది మింగించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యాతం సురేఖ విద్యార్థులతో మాట్లాడి నులిపురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవాలని, ఎల్లప్పుడూ శుభ్రమైన నీటిని తాగాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా బూట్లు లేదా చెప్పులు ధరించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయకుండా మరుగుదొడ్లను మాత్రమే వినియోగించాలని సూచించారు.Prakasam District News :పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా-దర్శిలో 100 మంది లబ్ధిదారులకు రూ.48.94 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
తినే ఆహారంపై ఎల్లప్పుడూ మూత ఉంచాలని, ఆహారం తీసుకునే ముందు, తీసుకున్న తర్వాత, మరుగుదొడ్డి వినియోగించిన అనంతరం చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని డాక్టర్ యాతం సురేఖ విద్యార్థులకు వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా నులిపురుగుల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ వసంత కుమార్, హెల్త్ సూపర్వైజర్ షేక్ జానీ బాషా, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



