
తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడబోతోంది! లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెన్త్ రిజల్ట్స్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు, అంటే బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 2 గంటలకు పదో తరగతి ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను విడుదల చేయబోతున్నారు.
ఈ ఏడాది మార్చి 14వ తేదీన ప్రారంభమైన పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 13వ తేదీతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల 15 వేల మంది రెగ్యులర్ విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే యుద్ధప్రతిపాదికన మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించిన విద్యాశాఖ, ఈ నెల 23వ తేదీ నాటికే జవాబు పత్రాల దిద్దుబాటును పూర్తి చేసింది. వాస్తవానికి ఫలితాలు మే మొదటి వారంలో వస్తాయని అందరూ భావించినప్పటికీ, రికార్డు స్థాయిలో పనులను పూర్తి చేసి, ఈ నెల 29నే అంటే బుధవారమే రిజల్ట్స్‌ను విద్యార్థుల ముందుకు తీసుకువస్తోంది ప్రభుత్వం.
ఫలితాల విడుదల నేపథ్యంలో ఇప్పటికే వెబ్సైట్లను సిద్ధం చేశారు అధికారులు. ఫలితాలు వెల్లడైన వెంటనే అధికారిక వెబ్సైట్లతో పాటు మొబైల్ యాప్స్‌లో కూడా మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. అటు ఫలితాల ప్రకటన అనంతరం రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
గత ఏడాది కంటే మెరుగైన ఉత్తీర్ణత శాతం నమోదవుతుందని విద్యాశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. మీ భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక ఫలితాల కోసం విద్యాశాఖ పోర్టల్‌ను నిరంతరం గమనిస్తూ ఉండండి. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్! మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి!


