మార్కాపురం, అక్టోబర్ 7: మార్కాపురం పట్టణానికి ప్రధాన ముఖద్వారంగా ఉన్న చెరువు కట్ట రోడ్డును ఆధునిక హంగులతో అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు డా. షేక్ మహబూబ్ వలి డిమాండ్ చేశారు. గుంతలమయంగా మారిన రహదారితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
చెరువు కట్ట రోడ్డును పూర్తిస్థాయిలో ఆధునికంగా నిర్మించడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా అమరవీరులు, ప్రముఖ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. చెరువు కాలువ గట్టుపై ఉన్న ప్రధాన రహదారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.Markapuram district news
అలాగే చెరువులో పేరుకుపోయిన ముళ్లకంపలను తొలగించి, పరిసరాలను సుందరీకరించాలని సూచించారు. చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే పట్టణానికి మరింత ఆకర్షణ పెరగడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని డా. షేక్ మహబూబ్ వలి పేర్కొన్నారు. రహదారి అభివృద్ధి, చెరువు సుందరీకరణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.



