GUNTUR DISTRICT NEWS: సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ మే 15న మంత్రి లోకేశ్ ఇంటికి పాదయాత్ర

Karthik

సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోరుతూ మే 15న మంత్రి లోకేశ్ ఇంటికి పాదయాత్ర జయప్రదం చేయాలని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జెఏసి చైర్మన్ బి కాంతారావు పిలుపునిచ్చారు. స్ధానిక పాత గుంటూరు లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం సమగ్ర శిక్షా ఉద్యోగుల జెఎసి జిల్లా కమిటీ సమావేశం కె కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి. కాంతారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం, మినిమం ఆఫ్ టైమ్ స్కేల్, వేతనాల పెంపు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంపు వంటి ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం మే 15, ఉదయం 8గం లకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర కు సంబంధించిన పోస్టర్, కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అందరు ఉద్యోగులు మరి వారి కుటుంబ సభ్యులు ఐక్యంగా పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని జేఏసీ పిలుపునిచ్చింది. కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు బి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రహీం, కోశాధికారి యం.గంగరాజు నాయకులు సిహెచ్ వినోద్, టి.దుర్గా మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

Author
Total Views: 0
Share This Article
Leave a review