Prakasam Dist News :దర్శిలో పారిశుధ్య విప్లవం- ‘మన దర్శి-మన బాధ్యత’తో కాలువ క్లీనింగ్.. స్వయంగా చీపురు పట్టిన గొట్టిపాటి లక్ష్మి

Sharat
4 Views

దర్శి :– ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే స్వచ్ఛమైన సమాజం సాధ్యమవుతుందని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని పొదిలి రోడ్డులో ఉన్న ఎల్ఐసి కార్యాలయం నుండి భాష్యం స్కూల్ వరకు ఉన్న ఎన్ఎస్పి పంట కాలువ శుభ్రత కోసం ‘మన దర్శి-మన బాధ్యత’లో భాగంగా ‘జెన్ జీ (Gen Z) ఫర్ దర్శి’ కార్యక్రమాన్ని శనివారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

వినూత్న కార్యక్రమానికి అనూహ్య స్పందన: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్వయంగా ప్రారంభించిన ఈ వినూత్న పారిశుధ్య కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థిని-విద్యార్థులు ఉదయమే తరలివచ్చి సుమారు 520 మీటర్ల మేర కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మితో పాటు యువత, మహిళలు స్వయంగా చీపుర్లు పట్టి చెత్తను తొలగించి తమ ఊరిపై ఉన్న బాధ్యతను చాటుకున్నారు.Prakasam District news

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ… “మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మున్ముందు దర్శి పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపడతాం” అని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, తినుబండారాల వ్యర్థాలు, కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీలలో మాత్రమే వేయాలని కోరారు. మన ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ: అనంతరం ‘జెన్ జీ ఫర్ దర్శి’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని శ్రమదానం చేసిన విద్యార్థినీ విద్యార్థులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రశంసా పత్రాలను (సర్టిఫికెట్లను) అందజేశారు.

భారీగా పాల్గొన్న నాయకులు, ప్రజలు: ఈ పారిశుధ్య విప్లవ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి-సుబ్బారావు, దర్శి మున్సిపల్ కమిషనర్ కె. అర్జున్ రావు, పట్టణ, మండల టీడీపీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ, మారెళ్ళ వెంకటేశ్వర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళలు, స్థానిక నాయకులు, ప్రజలు వందలాదిగా పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review