Vijayawada City News :దివ్యాంగులకు ప్రతినెలా సదరం స్లాట్ బుకింగ్ అవకాశం కల్పించాలి-సచివాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల్లోనూ బుకింగ్ సౌకర్యం కల్పించాలి.. సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ డైరెక్టర్‌కు నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా వినతి

S Sarath
3 Views

విజయవాడ:– ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు స్లాట్ బుకింగ్‌లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా కోరారు. ఈ మేరకు విజయవాడలోని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ డైరెక్టర్ టి. రవీంద్రను కలిసి వినతిపత్రం అందజేసి, సమస్యలను వివరించారు.

ప్రస్తుతం సదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు దివ్యాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలేషా తెలిపారు. గతంలో ప్రతి నెలా మీ సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండేదని, ప్రస్తుతం మూడు నెలలకు ఒకసారి సచివాలయాల్లో మాత్రమే అవకాశం కల్పించడం వల్ల అర్హులైన దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది అందుబాటులో లేకపోవడం, ఉన్న సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. దివ్యాంగులు ఒక కేటగిరీకి స్లాట్ బుక్ చేయాలని కోరితే మరో కేటగిరీలో బుకింగ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయని, దీనివల్ల వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే స్లాట్లు అందుబాటులో ఉండటంతో బుకింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే స్లాట్లు పూర్తవుతున్నాయని కాలేషా పేర్కొన్నారు. ఫలితంగా స్లాట్ బుక్ చేసుకోలేని అర్హులైన దివ్యాంగులు తదుపరి అవకాశం కోసం మరో మూడు నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.NTR District News

దివ్యాంగుల సమస్యలను సమగ్రంగా పరిశీలించి, గతంలో మాదిరిగానే ప్రతి నెలా సదరం స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సచివాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల్లో కూడా స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమస్యలను సంబంధిత ఆరోగ్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు పొందే ప్రక్రియను సులభతరం చేసేలా చర్యలు తీసుకోవాలని సంక్షేమ శాఖ ఇన్‌చార్జ్ డైరెక్టర్‌ను షేక్ కాలేషా కోరారు.

Author
Share This Article
Leave a review