కనిగిరి:– రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు, ఎస్‌ఐఆర్ అంశాలపై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందన్నారు.
పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జిల్లా పార్టీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సూచనల మేరకు నాయకులు, కార్యకర్తలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దద్దాల సూచించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పన్నులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తదితర అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని తెలిపారు.Markapuram district news :స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలి-పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి- దద్దాల నారాయణ యాదవ్
అభ్యర్థులు గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో సంబంధిత ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు స్వీకరించకపోయినా, సర్వర్ పనిచేయకపోయినా ఆ పరిస్థితులను వీడియో రూపంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ నేతలతో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేస్తామని దద్దాల నారాయణ యాదవ్ పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనే విధంగా పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమన్వయంతో పనిచేయాలని, అభ్యర్థులు అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకుని ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.



