విజయవాడ;- పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పలువురు వక్తలు విమర్శించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు విద్యార్థుల డిమాండ్లకు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శి (మైనారిటీ) బాజీ బాబా, 41వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎండి ఇర్ఫాన్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అబ్దుల్ రెహమాన్, మైనారిటీ సహాయ కార్యదర్శి షేక్ నజీర్, మైనారిటీ జిల్లా కార్యదర్శి మొహ్సిన్, మైనారిటీ నాయకులు మస్తాన్, అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.



