GUNTUR CITY NEWS: గుంటూరులో పారిశుధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన యూనిడో బృందం

Karthik

సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యూనిడో) ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థలు మరియు మునిసిపాలిటీల కమిషనర్ల బృందం మంగళవారం పరిశీలించింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బృందానికి నగరంలో యూనిడో సహకారంతో అమలు చేస్తున్న పలు వినూత్న కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ-ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యత ఇస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ-ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని వివరించారు. అనంతరం బృందం ఐపీడీ కాలనీలో డోర్-టు-డోర్ చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించింది. ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానం, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, చెత్త నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న తీరును అధికారులు వివరించారు. ఎన్‌ఎస్‌కేఎఫ్డీసీ సహకారంతో ర్యాగ్ పికర్స్ కి అందించిన వాహనాలను పరిశీలించి, వారితో మాట్లాడారు. తదుపరి సంగం జాగర్లమూడి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ పనితీరును పరిశీలించారు. నీటి వనరులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తితో పాటు నీటి ఆవిరీభవనాన్ని తగ్గించే ప్రయోజనాలను కమిషనర్ వివరించారు. పర్యటన అనంతరం కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సురభి మాలిక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణ, ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ అనుకూల కార్యక్రమాల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ప్రజారోగ్య రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు ఫలితాలను ఇస్తున్నాయని, భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం, యూనిడో సంయుక్త సహకారంతో పట్టణాభివృద్ధి, పారిశుధ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరిన్ని కార్యక్రమాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. గుంటూరులో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఇతర నగరాల్లో కూడా విస్తరించేందుకు పరిశీలిస్తామని వెల్లడించారు.

Author
Share This Article
Leave a review