మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి..

Karthik

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠ జిల్లా కలెక్టర్లు, ఎస్పీ లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్, పొన్నూరు మున్సిపాలిటీలకు నవంబర్ 26న పోలింగ్ , నవంబర్ 30న కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు కూడా అన్ని విధాలుగా సన్నద్ధతతో ఉండాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మండల ప్రత్యేక అధికారులు పూర్తి బాధ్యత తీసుకొని ఏర్పాట్లను పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి క్లస్టర్ కేంద్రంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ), ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓ)లకు శిక్షణ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వీడియోగ్రఫీ, వెబ్‌కాస్టింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే ప్రచురించిన ఓటర్ల జాబితాలను వినియోగించాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.గుంటూరు నగరపాలక సంస్థ, తెనాలి మున్సిపల్ పరిధి మినహాయించి జిల్లా అంతటా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉందని తెలిపారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్ఓ ఖాజావలి, జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, డీపీఓ నాగ సాయికుమార్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review