GUNTUR CITY NEWS: పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు

Karthik

గుంటూరు నగర స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ సజావుగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (యంసిసి) ను పక్కాగా అమలు జరిగేలా చూడాలని నగర కమిషనర్ మరియు అడిషనల్ ఎలక్షన్ అధారిటీ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన నేపధ్యంలో నగరంలో ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందన్నారు. నగరంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కగా అమలు చేయుటకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. సదరు టీంలు ప్రజల నుండి మరియు రాజకీయ పార్టీల నుండి వచ్చే ఫిర్యాదులకు వేగంగా స్పందించి, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల సమయంలో అక్రమ నగదు రవాణా, మద్యం పంపిణీ, ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలు, ఆయుధాలు మరియు అనుమానాస్పద వస్తువుల రవాణాపై కఠిన నిఘా ఉంచాలన్నారు. స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు నగర ప్రవేశ మార్గాలలో మరియు ముఖ్య రహదారులు అనుమానాస్పద ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వస్తువుల కదలికలను పరిశీలించాలని తెలియచేశారు. తనిఖీల సమయంలో వీడియోగ్రాఫ్ చేసి, రోజువారీ నివేదికలను రిటర్నింగ్ అధికారి మరియు ఎన్నికల అధికారులకు అందించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి రాజకీయ అభ్యర్ధులు ర్యాలీలు, సభలు ఏర్పాటు చేస్తే వాటికి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని, దానికోసం నగర పాలక సంస్థలో సింగల్ విండో విధానాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, రాజకీయ పార్టీల సమావేశాలు మరియు ప్రచార కార్యక్రమాలపై నిఘా ఉంచాలని, ఎటువంటి ఉల్లంఘన గుర్తించినా వెంటనే నివేదించాలని అధికారులను ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లను ప్రలోభపెట్టె వారిపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకుల సోషల్ మీడియా అకౌంట్ లను కూడా పర్యవేక్షణ చేయాలని, వాటిలో మత పరమైన అంశాలు ఉన్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జి.రవీంద్ర బాబు (ఎస్ డబ్ల్యు) మేనేజర్ బాలాజీ బాష, ఫ్లయింగ్ స్క్వాడ్స్ మరియు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌ల ప్రతినిధులు, ఎలక్షన్ సెల్ విభాగ అధికారులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review