Machilipatanam City news :ఐదేళ్లలో రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు-జిల్లా పరిషత్ పాలకవర్గం సేవలను అభినందించిన కలెక్టర్ డీకే బాలాజి

S Sarath
1 View

మచిలీపట్నం, సెప్టెంబరు 22: కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలంలో సుమారు రూ.400 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినట్లు జడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. తాగునీరు, గ్రామీణ మౌలిక వసతులు, అంత్యక్రియల షెల్టర్లు, మహిళా సాధికారత, విద్యార్థుల విద్యాభివృద్ధి, కారుణ్య నియామకాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.

జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఈ నెల 24తో ముగియనున్న నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ ఉప్పాల హారికతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఇతర సభ్యులను ఘనంగా సత్కరించారు. జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా నియమితులైన జిల్లా కలెక్టర్ డీకే బాలాజిని కూడా అభినందించారు.

ఈ సందర్భంగా ఉప్పాల హారిక మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో జిల్లా పరిషత్ నిధులు జిల్లాలోని ప్రతి గ్రామానికి, మారుమూల ప్రాంతాలకు చేరేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అధికారుల, ఉద్యోగుల, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల సహకారంతో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయగలిగామని చెప్పారు.

సీపీడబ్ల్యూ పథకాల కింద సుమారు రూ.210 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని, ప్రజలు గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు పలు ప్రాంతాల్లో క్రిమేషన్ షెల్టర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి సుమారు 400 కుట్టు మిషన్లను పంపిణీ చేసినట్లు ఉప్పాల హారిక తెలిపారు. ఇందుకోసం సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ‘స్ఫూర్తి’ పేరుతో పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను ప్రతి సంవత్సరం అందించామని, ఐదేళ్లలో ఇందుకోసం సుమారు రూ.1.40 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారుMachillipatnam City news.

కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాలు కల్పించడంలో జిల్లా పరిషత్ ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. సుమారు 260 మందికి కారుణ్య నియామకాలు కల్పించినట్లు తెలిపారు.

కృష్ణా జిల్లా పరిషత్ 1960లో ఏర్పాటైందని, తొలి చైర్మన్ యాళ్లగడ్డ శివరామప్రసాద్ నుంచి ఇప్పటి వరకు పది మంది చైర్మన్లు సేవలందించారని ఉప్పాల హారిక గుర్తుచేశారు. ప్రస్తుత పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలం ముగుస్తున్నప్పటికీ ఇది ముగింపు కాదని, భవిష్యత్ ప్రజాసేవకు మరో పునాది అని పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సభ్యులు, మీడియా ప్రతినిధులు, జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా అభివృద్ధికి జడ్పీ వెన్నెముక

జిల్లా పరిషత్ వ్యవస్థ జిల్లా అభివృద్ధికి వెన్నెముక వంటిదని కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్ వంటి స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధమైన ప్రాధాన్యత లభించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు స్థానిక వనరులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

జిల్లా పరిషత్ చురుకుగా, బాధ్యతాయుతంగా పనిచేస్తే అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతాయని అన్నారు. కృష్ణా జిల్లా పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల కాలంలో జిల్లాకు గణనీయమైన సేవలు అందించిందని పేర్కొన్నారు. పాలకవర్గం సభ్యులందరికీ కృష్ణా జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలిపారు.

జిల్లా పరిషత్ విజయవంతంగా పనిచేయడంలో అధికారులు, ఉద్యోగుల పాత్ర కూడా కీలకమని కలెక్టర్ అన్నారు. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీఈఓ వరకు, వర్క్ ఇన్‌స్పెక్టర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండింగ్ ఇంజనీర్ వరకు ప్రతి స్థాయిలోని ఉద్యోగులు సమన్వయంతో పనిచేసినప్పుడే సంస్థ సమర్థవంతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. పాలకవర్గం పదవీకాలం పూర్తయ్యే వరకు పనిచేసిన ప్రతి ఉద్యోగిని అభినందించారు.

ప్రజాసేవలో ఉన్నవారు ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ కుటుంబ సభ్యులు, సమాజంతో సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. పాలకవర్గ సభ్యుల భవిష్యత్ ప్రణాళికలు విజయవంతం కావాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, శాసనమండలి సభ్యుడు మొండితోక అరుణ్ కుమార్, జిల్లా పరిషత్ సీఈఓ డాక్టర్ జె. అరుణ, డీఆర్వో కే. శ్రీధర్ రెడ్డి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఆనంద్ కుమార్, జెడ్పీ వైస్ చైర్మన్లు గరికపాటి శ్రీదేవి, గుడిమళ్ళ కృష్ణంరాజు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review