విజయవాడ, అక్టోబర్ 7:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా ప్రస్థానం 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం కలగడంతో పాటు దేశాన్ని వికసిత్ భారత్ దిశగా ముందుకు నడిపించేందుకు మరింత శక్తి సామర్థ్యాలు లభించాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో విశిష్టమైన ఖడ్గమాల అర్చన నిర్వహించారు. దేశ సేవలో మోదీ చేస్తున్న కృషికి కనకదుర్గమ్మవారి ఆశీస్సులు లభించాలని పూజలు చేశారు.
ఈ సందర్భంగా లింగమనేని రమేష్ మాట్లాడుతూ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రారంభించిన ప్రజా ప్రస్థానం 25 ఏళ్లుగా విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధిస్తోందని పేర్కొన్నారు. దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని, మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలకు ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత లభిస్తోందన్నారు.Vijayawada City News
మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.
దేశాభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ పురోగతికి కృషి చేస్తున్న నరేంద్ర మోదీకి మరింత శక్తి సామర్థ్యాలు కలగాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై ఖడ్గమాల అర్చన నిర్వహించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు లింగమనేని రమేష్ తెలిపారు. భారత్ మరింత బలమైన, సుసంపన్నమైన, ఆత్మనిర్భర దేశంగా ఎదగాలని, వికసిత్ భారత్ సంకల్పం సాకారం కావాలని ఆకాంక్షించారు.
ఖడ్గమాల అర్చన ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రాలను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపనున్నట్లు లింగమనేని రమేష్ తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, ఠాకూర్ అజయ్ వర్మ, ఆలయ పాలక మండలి సభ్యులు ఎం. రామబ్రహ్మం, పద్మావతి ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.



